వైవాహిక బంధానికి ముగింపు పలికిన ఏఆర్ రెహమాన్ దంపతులు

మెగా9 వెబ్ డెస్క్ : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్, ఆయన సతీమణి సైరాబాను తమ దాంపత్య జీవితానికి ముగింపు పలికారు. తన భర్త ఏఆర్ రెహమాన్‌తో విడాకులు తీసుకున్నట్లు సైరాబాను ప్రకటించారు. ఈ మేరకు నవంబర్ 19, 2024న సైరాబాను తరఫున న్యాయవాది ఓ ప్రకటన విడుదల చేశారు.

అయితే, ఏఆర్ రెహమాన్ తో తమ 29 ఏళ్ల దాంపత్య జీవితం నుంచి తప్పుకోవాలని కఠిన నిర్ణయాన్ని సైరాబాను తీసుకున్నారు. తమ మధ్య ఏర్పడిన అగాధం ఇక పోదని ఇద్దరూ భావిస్తున్నారంట. ఈ కష్టకాలంలో తన ప్రైవసీని గౌరవించాలని ప్రజలను సైరాబాను కోరుతున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

1995లో పెళ్లితో ఒకటైన వీరిద్దరికి ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. సైరాబాను వివాహాన్ని తన తల్లి నిశ్చయించిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.

ఇక ఇప్పుడు ఈ దంపతుల విడాకులపై ఏఆర్ రెహమాన్ స్పందిస్తూ, “మా వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించాం. అయితే, అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. విరిగిన హృదయాలు దేవుడిని సైతం ప్రభావితం చేస్తాయి. పగిలిన ముక్కలు మళ్లీ యథావిధంగా అతుక్కోలేవు. అయినప్పటికీ మా దారుల్లో అర్ధాన్ని వెతుక్కుంటాం. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం” అని తన ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.