వీఐపీ కల్చర్ పై నటి ప్రణీత అసహనం

Spread the love

వీఐపీ కల్చర్ కొన్ని సార్లు పబ్లిక్ ఇబ్బందిపడేందుకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా పలు చోట్ల వీఐపీ కల్చర్ సాధారణ జనజీవనానికి ప్రసహనంగా మారింది. ఇక తాజాగా  సినీ నటి ప్రణీత సుభాష్ వీఐపీ సంస్కృతి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరులో ఒక  రాజకీయ నాయకుడి పర్యటన కోసం ట్రాఫిక్‌ ను గంటల తరబడి నిలిపివేయడంపై ఆమె సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఇలాంటి చర్యల వల్లే దేశం ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బెంగళూరులోని సిటీ సెంటర్, కోరమంగళకు వెళ్లే మార్గాలను ఓ వీఐపీ కాన్వాయ్ కోసం మూసివేయడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ అంశంపై  స్పందించిన ప్రణీత, “ఇది చాలా చికాకుగా ఉంది. ఓ రాజకీయ నాయకుడి వీఐపీ పర్యటన కోసం రోడ్లను మూసివేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కచ్చితంగా ఇలాంటి వాటి వల్లే మన దేశం ముందుకు వెళ్లకపోవడానికి కారణం  అని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, వారి వీఐపీ జీవితాలు దేశం ఎదగడానికి ఏమాత్రం సాయపడకపోగా, మరిన్ని సమస్యలను మాత్రమే సృష్టిస్తున్నాయంటూ ఆమె తన పోస్టులో ఘాటుగా విమర్శించారు. ప్రణీత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీఐపీ కల్చర్ వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను పలువురు నెటిజన్లు కూడా షేర్ చేసుకుంటూ ప్రణీతకు మద్దతు పలుకుతున్నారు.