మామిడి సాగులో సమ్మర్ మేనేజ్‌మెంట్ 

Spread the love

మామిడి రైతులకు కీలక సమయం వేసవి సీజన్. ఇదే సమయంలో ప్రకృతి ఒక అతిపెద్ద సవాల్ విసురుతుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతాయి. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటినప్పుడు మామిడి చెట్లు తీవ్రమైన వడగాల్పులకు గురవుతాయి.  చెట్టులో నీటి శాతం తగ్గడం అలాగే పిందెలు నేలరాలిపోతాయి. ఎండ దెబ్బకు కాయలపై నల్లటి మచ్చలు పడి సన్ బర్న్ కు లోనవుతాయి. కాయలు అలాగే ఉంటే  మార్కెట్లో కాయలకు సరైన ధర రాక రైతు తీవ్రంగా నష్టపోతాడు. మరి ఈ వేసవి కాలంలో మామిడి తోటను ఎలా కాపాడుకోవాలి?  భూమిలో తేమ ఆవిరి కాకుండా  మల్చింగ్  ఎలా చేయాలి?  ఎండల వల్ల పిందె రాలకుండా, కాయ సైజు మంచిగా  పెరగాలంటే రైతు అనుసరించాల్సిన పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం.  

మామిడి సాగులో అత్యంత కీలకమైన సీజన్ ఈ వేసవి కాలమే.  రంగు, రుచి అంతా ఈ రెండు మూడు నెలల్లో మనం ఇచ్చే నీరు, పోషకాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇక సాధారణంగా పూత అధికంగా కనిపించినా, పిందె పట్టే సమయంలో తెగుళ్ల సమస్య ఉంటుంది.  పూత, పిందె దశలోనే నేల రాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైతులు అలర్టై  పూత దశ నుంచే సస్యరక్షణ చర్యలు తీసుకుంటే పంట దిగుబడి బాగుంటుంది. వాతావరణంలో ఒక్కసారిగా వేడి పెరగడం వల్ల, చెట్టు తనను తాను కాపాడుకోవడానికి బరువు తగ్గించుకునే ప్రయత్నంలో.. కాయలను కిందకు రాల్చేస్తుంది .  దీనిని అరికట్టడానికి నిపుణులు అధికారులు ప్రధానంగా  వాటర్ మానేజ్మెంట్ పై దృష్టి పెట్టాలని చెబుతున్నారు. అలాగే, ఎండ తీవ్రతకు కాయలు రాలిపోకుండా కొన్ని ప్రత్యేకమైన పోషకాలను పిచికారీ చేయాల్సి ఉంటుంది.  వేసవిలో మామిడి తోటల్లో  పిందె కాయగా మారే క్రమంలో నీటి అవసరం చాలా ఉంటుంది. పిందెలు ఒక చిన్న  సైజుకు చేరుకున్నప్పటి నుంచి, కాయ కోతకు వచ్చే 15 రోజుల ముందు వరకు క్రమం తప్పకుండా నీరు అందించాలి. నేల స్వభావాన్ని బట్టి ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి తడులు ఇవ్వాలి. కాలువల ద్వారా నీరు పెట్టడం కంటే, డ్రిప్ ద్వారా నీరు ఇవ్వడం మంచిది.  దీనివల్ల నీరు వృధా కాకుండా నేరుగా వేర్లకు అందుతుంది. 10 ఏళ్లు దాటిన చెట్టుకు రోజుకు కనీసం 2 గంటల పాటు డ్రిప్ ద్వారా నీరు అందించాలి.  చాలా కాలం పాటు వాటర్ పెట్టకుండా వదిలేసి, సడెన్‌గా ఒకేసారి ఎక్కువ నీరు పట్టినా పిందెలు రాలవచ్చు. . అలాగే కాయలు పగిలిపోయే  ప్రమాదం ఉంది. కాబట్టి క్రమం తప్పకుండా తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. ఎండల నుంచి చెట్టును కాపాడే అత్యంత చవకైన , అద్భుతమైన టెక్నిక్ మల్చింగ్ .  ఎండాకాలంలో నేల వేడెక్కి నీరంతా త్వరగా ఆవిరైపోతుంది. దీన్ని అరికట్టడానికి చెట్టు మొదలు చుట్టూ , కనీసం 10 సెంటీమీటర్ల మందంలో ఎండుటాకులు, వరి గడ్డి, కొబ్బరి పీచు లేదా వేరుశనగ పొట్టుతో కప్పాలి.ఈ నేచురల్ విధానంతో సూర్యరశ్మి నేరుగా నేల మీద పడదు. భూమిలో తేమ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఎండుగడ్డి కాలక్రమేణా కుళ్లిపోయి చెట్టుకు అద్భుతమైన సేంద్రియ ఎరువుగా  మారుతుంది. వేసవిలో కలుపు మొక్కలు పెరగకుండా కూడా ఈ మల్చింగ్ అడ్డుకుంటుంది.

మే నెలలో ఎండల తీవ్రతకు, సూర్యుడి వైపు ఉన్న కాయలు మాడిపోయి నల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీన్ని సన్‌బర్న్ అంటారు. ఇక ఎండాకాలంలో కాయలు ఎదుగుతున్న సమయంలో పండ్ల ఈగ  బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి  నివారణతో పాటు   పిందె రాలకుండా తీజాగ్రత్తలు తీసుకోవాలి. మామిడి సాగులో అత్యధిక దిగుబడి రావాలంటే వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.  సరైన వాటర్  మానేజ్మెంట్, మల్చింగ్ చేయడం, వడగాల్పుల నుండి  రక్షించే పోషకాలు పిచికారీ చేయడం,  పురుగులను కంట్రోల్ చేయడం తప్పనిసరి. ఈ శాస్త్రీయ  పద్ధతులను పాటిస్తే ప్రతి రైతుకు మంచి ఆదాయం లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *