దేశవ్యాప్తంగా ‘కుంకుమపువ్వు’ ప్రత్యామ్నాయ సాగు మార్గాలు

Spread the love

కుంకుమ పువ్వు.. కిలో ధర లక్షల్లో పలికే ఈ పంటను ఎర్ర బంగారం అని పిలుస్తారు. ఇది పండాలంటే మంచు కొండలు ఉండాలి, చల్లని గాలులు వీచాలి. అందుకే ఇది కేవలం కాశ్మీర్ లోయకే పరిమితం అని ఇన్నాళ్లూ అనుకున్నాం. కానీ, ఎండలు మండిపోయే  పలు చోట్ల సైతం ఈ కుంకుమ పువ్వును పండించవచ్చని మన శాస్త్రవేత్తలు నిరూపించారు. అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. పలు ప్రాంతాల్లో కృత్రిమంగా కాశ్మీర్ వాతావరణాన్ని సృష్టించి మరీ ఈ పంటను పండిస్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? శాస్త్రవేత్తలు వినియోగించిన టెక్నాలజీ ఏంటి?  దీనివల్ల రైతులకు కలిగే లాభం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. హార్టికల్చర్ రంగంలో ఇదొక మైలురాయి. సాధారణంగా పొలంలో సాగు చేస్తే ఇక్కడి వాతావరణానికి మొక్కలు బతకవు. అందుకే కొన్ని చోట్ల ఏరోపోనిక్స్ అనే అత్యాధునిక విధానాన్ని ఎంచుకున్నారు. అంటే మట్టి అవసరం లేకుండా, ప్లాస్టిక్ ట్రేలలో గాలిలోనే మొక్కల వేళ్లను పెంచే పద్ధతి అన్నమాట. కేవలం 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ఏరోపోనిక్ మోడల్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్ లోపల అడుగుపెడితే కాశ్మీర్ లో ఉన్నట్టే ఉంటుంది. శాస్త్రవేత్తలు అంతటి టెక్నాలజీని  ఇక్కడ వాడారు.  కాశ్మీర్ లో పగలు, రాత్రి ఉండే ఉష్ణోగ్రతలు, గాలిలో ఉండే తేమ , సూర్యరశ్మి, కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలను.. కృత్రిమంగా  ఏసీలు, చిల్లర్లు, హ్యుమిడిఫైయర్లు, ఎల్ఈడి లైట్ల ద్వారా కృత్రిమంగా సృష్టించారు. ఒక మొబైల్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ల్యాబ్ లోని వాతావరణాన్ని కంట్రోల్ చేస్తూ, మొక్కలకు కావాల్సిన పోషకాలను స్ప్రే రూపంలో అందిస్తారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో రియల్ ఎస్టేట్ బూమ్ వల్ల కుంకుమ పువ్వు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. వాతావరణ మార్పుల వల్ల నాణ్యత కూడా తగ్గుతోంది. ప్రపంచంలో ఈ పంటకు విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ సాగు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ విధంగా చేస్తే  గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపునిస్తుందని, రైతులకు కొత్త ఆదాయ మార్గాలను చూపించేందుకు అవకాశం ఉంటుంది. చిన్న గదిలో, ఇంటి పైన కూడా ఈ పంటను సాగు చేసుకుని లక్షల్లో ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇక  ఎర్ర బంగారం పండించాలంటే కాశ్మీర్ వెళ్లక్కర్లేదు, మన ఇంట్లో ఒక గది ఉంటే చాలు అనే రోజులు వచ్చేశాయి. దేశంలోనే వివిధ ప్రాంతాల్లో ఈ దిశగా రైతులు ఆసక్తి చూపుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *