అందనంటూ ఊరిస్తున్న మామిడి..తగ్గుతున్న దిగుబడి – పెరుగుతున్న ధరలు

Spread the love

వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తినేవారు అందరి ఇళ్లలో ఉంటారు..ఈ సీజన్ రావాలని మామిడి పండ్ల కోసం ఎదురుచూస్తుంటారు. సంవత్సరం మొత్తం ఇష్టంగా తినే ఆవకాయ్ పెట్టుకునే సీజన్ కూడా ఇదే. అలాంటిది తగ్గిన దిగుబడితో అటు మామిడి రైతులకు, ఇటు వినియోగదారులకు ఈ మామిడి సీజన్ కొంత నిరాశనే కలిగించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో కాయ రాకపోవడంతో తోటల దగ్గరే ఈ  పరిస్థితి కనిపిస్తుండడం నిజంగా మామిడి ప్రియులకు నిరాశే.  ఏటా ఎంతో ఆశతో పెట్టుబడి పెట్టే అన్నదాతలకు, ఈసారి వచ్చిన అరకొర దిగుబడి కనీసం పెట్టుబడి ఖర్చులను కూడా ఇచ్చేలా లేదని వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు మామిడి దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణం మారుతున్న వాతావరణ పరిస్థితులేనని స్పష్టమవుతోంది. పూత వచ్చే సమయంలో అకాల వర్షాలు పడటం, లేదా విపరీతమైన వేడి గాలులు వీయడం వల్ల పూత రాలిపోయి పిందె నిలవలేదు. వాతావరణ పరిస్థితుల  ప్రభావం మామిడి తోటలపై తీవ్రంగా పడటంతో, దిగుబడిపై రైతుల పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.  అటు మార్కెట్ లో  వినియోగదారుల నుండి మామిడికి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. కానీ, ఆ డిమాండ్‌కు సరిపడా దిగుమతులు మార్కెట్‌లోకి రావడం లేదు. ఏటా ఈ సమయానికి సందడిగా ఉండే మామిడి మార్కెట్లు, ఈ ఏడాది దిగుబడి తగ్గి  వెలవెలబోతున్నాయి. దీనివల్ల మార్కెట్‌లో పండ్ల కొరత కనిపిస్తోంది. డిమాండ్ పెరిగి  సరఫరా తక్కువగా ఉండటంతో సహజంగానే మామిడి ధరలు భారీగా ఉంటున్నాయి.  సామాన్య ప్రజలు సైతం ఇష్టపడి తినే ఈ సీజనల్ సూపర్ ఫ్రూట్  ఇప్పుడు సామాన్యుడిని దూరం నుండి ఊరిస్తోంది. మార్కెట్‌ కు లో  వినియోగదారులు ధరలను చూసి బెంబేలెత్తుతున్నారు. గతంతో పోలిస్తే ధరలు ఈ స్థాయిలో పెరిగిపోవడంపై వినియోగదారులను అసంతృప్తికి గురిచేస్తోంది. మామిడి పండ్లంటే ఎంత ఇష్టమున్నా అంత ధర పెట్టి కొనడం భారంగా మారుతోందని సగటు మధ్యతరగతి మనిషి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన పండ్ల ధరలు మరీ ఎక్కువగా ఉండటంతో, కొనుగోలుదారులు కొనలేకపోతున్నారు. ఫలితంగా వ్యాపారాలు కూడా తగ్గుతున్నాయి.  రైతుల పరిస్థితి చూస్తుంటే మరోలా ఉంది. ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, దాని వలన తమకు పెద్దగా లాభం చేకూర్చడం లేదని వారు వాపోతున్నారు.  ఎందుకంటే దిగుబడి తగ్గడంతో వచ్చిన కొద్దిపాటి ఆదాయం రవాణా మరియు కూలీల ఖర్చులకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు వినియోగదారుడు ఇటు రైతు ఇద్దరికీ ఈ సీజన్ ఏ మాత్రం లాభసాటిగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాతావరణ పరిస్థితులతో సాగు రంగంపై ఎంతటి ప్రభావం పడుతుందనే దానికి ఈ పరిస్థితులు ప్రతిబింబిస్తున్నాయి. ఇక ముందైనా వాతావరణ పరిస్థితులు అనుకూలించి  అందరికీ అందుబాటులోకి రావాలని అటు రైతులు, ఇటు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *