దశాబ్దాలుగా తన నటనతో సినీ పరిశ్రమను మకుటం లేని మహరాజులా ఏలుతూ వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవి నిజ జీవితంలో ఎన్నో సేవా కార్యక్రమాలతో ఆపన్నహస్తం అందిస్తూ ఎన్నో జీవితాలను ఆడుకుంటూ తనదైన ఉదారతను చాటుకుంటున్నారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కేవలం ఒక సందర్భానికో, ఒక్క సంఘటనతో పరిమితం కావు. దశాబ్దాలుగా ఆయన నిరంతరం సేవ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా ఆయన చేసిన సేవలు లక్షలాది మంది జీవితాలను మార్చాయి. రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాలు ప్రారంభించి, ఎన్నో కుటుంబాలకు కొత్త జీవితం ఇచ్చారు. కరోనా మహమ్మారి సమయంలో ఆయన చేసిన సేవలు మరింత గొప్పగా నిలిచాయి. ముఖ్యంగా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులలో చిరంజీవి ముందుకొచ్చి ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి వేలాది మందికి ప్రాణాధారంగా నిలిచారు. ఆ రోజుల్లో ఆయన చేసిన సహాయం ఎంతో మంది కుటుంబాలకు జీవం పోసింది. అభిమానులు మాత్రమే కాదు..ఆయన వలన సహాయం పొందిన వారు ఆయనను “ఆపద్బాంధవుడు” అని పిలుస్తారు. తనతో కలిసి పనిచేసిన వారిపై ఆయన చూపించే ప్రేమ, గౌరవం కూడా చాలా ప్రత్యేకం. సినిమా సెట్స్‌లో పనిచేసే చిన్న ఉద్యోగి నుంచి పెద్ద టెక్నీషియన్ వరకు… ఎవరికైనా కష్టం వస్తే చిరంజీవి ముందుగా స్పందిస్తారు. ఈ విషయం ఇటీవల జరిగిన రెండు సంఘటనల ద్వారా మరింత స్పష్టమైంది. ఇటీవల సినీ పరిశ్రమలో చాలా కాలంగా మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న శివనాథ్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి ఆలస్యం చేయకుండా స్పందించారు. ఆయన చికిత్స కోసం సుమారు రూ.10.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు… ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఆశిస్తూ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆ సమయంలో ఆ కుటుంబానికి చిరంజీవి ఒక పెద్ద ఆధారంగా నిలిచారు. మరో సంఘటనలో తన మాజీ మేనేజర్ నరసయ్య కుటుంబానికి కూడా చిరంజీవి అండగా నిలిచారు. నరసయ్య భార్యకు అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు, ఆ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి స్పందించారు. సర్జరీ ఖర్చుల కోసం రూ.9.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. అంతేకాదు… సర్జరీ ఏర్పాట్లను కూడా స్వయంగా పర్యవేక్షించారు. ఆ కుటుంబం ఒంటరిగా ఫీలవకుండా, “నేను ఉన్నాను” అనే భరోసా ఇచ్చారు. కేవలం ఒక వారం వ్యవధిలోనే సుమారు 20 లక్షల రూపాయల సాయం చేసి రెండు కుటుంబాలను కష్టాల నుంచి బయటకు తీశారు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా… ఆయన తన సేవా మార్గాన్ని ఎప్పుడూ ఆపలేదు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా, తన పని చేస్తూనే ఉంటారు. ఆయన నమ్మకం ఒకటే: మనిషిగా పుట్టినప్పుడు, మరొక మనిషికి ఉపయోగపడాలి. అదే ఆయన జీవన విధానం.