ఈ సారి జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఉమ్మడి జిల్లా, నగర, మండల కేంద్రాలు, పంచాయతీల్లో నిర్వహించాలని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఆ పార్టీ శ్రేణులకు పార్టీ అధినేత పవన్ పిలుపునిచ్చారు. ఆ రోజు అన్ని జిల్లా, నగర, మండల కేంద్రాలు, పంచాయతీల్లో జనసేన పార్టీ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పార్టీ పతాకాన్ని-జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, ఉద్యమి సభ్యత్వం పొందినవారి సమక్షంలో ఎగురవేస్తారు. సైద్ధాంతిక బలంతో, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఏ విధంగా ముందుకు వెళ్తుందో పార్టీ శ్రేణులకు, ప్రజలకు వివరిస్తారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రక్త దాన శిబిరాలు, ఆహార వితరణ, పర్యావరణ సంబంధిత కార్యక్రమాల్లాంటివి చేపట్టాలని పవన్ పిలుపునిచ్చారు. ఎండల తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం మార్పు జరిగింది. ఈ సారి జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర స్థాయిలో పిఠాపురంలో నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయనే రిపోర్టులను పరిగణనలోకి తీసుకొన్నారు. అందుకు అనుగుణంగా వేడుకల నిర్వహణ స్వరూపాన్ని మార్చారు. ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా కాకుండా జిల్లా, సిటీ, మండల కేంద్రాల్లో నిర్వహించి కార్యకర్తల్లో ఉన్న ఉత్సాహాన్ని కొనసాగించాలని పార్టీ అధినేత పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడికక్కడ స్థానికంగా వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.