తిరుమలలో ఆహార నాణ్యతను మెరుగుపరచేందుకు ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. స్టేట్ ఫుడ్ లాబరేటరీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వాటర్, ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ ను నేడు ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం వినియోగించే వివిధ ఆహార పదార్థాలను టెస్ట్ చేసేలా ల్యాబ్ ఏర్పాటు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం రూ.25 కోట్ల వ్యయంతో ల్యాబ్ నిర్మాణం పూర్తి చేసింది. ఏపీ హెల్త్ మినిష్టర్ సత్య కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 11 ప్రాంతాల్లో స్టేట్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ల్యాబ్‌ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందనున్నాయి.ఇప్పటికే తిరుమలలో రూ.25 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌లో పాలు, నెయ్యి, ముడి సరుకులు సహా అన్ని రకాల ఆహార పదార్థాల స్టాండర్డ్స్ టెస్ట్ చేసే సదుపాయం ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరికరాలతో ఈ ల్యాబ్‌ను సిద్ధం చేయగా, ఫ్రాన్స్ నుంచి ప్రత్యేక టెక్నాలజీ పరికరాలను కూడా తీసుకురానున్నారు. అదనంగా, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో రాష్ట్ర స్థాయి ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు అవుతున్నాయి. నెల రోజుల్లో విశాఖపట్నంలో ల్యాబ్ ప్రారంభం కానుండగా, మూడు నెలల్లో గుంటూరు, కర్నూల్, విజయవాడలో ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్లాన్ రూపొందించింది.రాబోయే రెండు సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న అన్ని ల్యాబ్ లకు నేషనల్ అక్రిడిటేషన్ పొందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సత్య కుమార్ తెలిపారు.