జలవనరుల పరిరక్షణే మన లక్ష్యం:ఏపీ సీఎం చంద్రబాబు 

Spread the love

రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసం చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ‘జలధార’ కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గం నుండి ఏపీ సీఎం చంద్రబాబు  ప్రారంభించారు. చెరువుల పూడికతీత, కాల్వల మరమ్మతులు, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణే ధ్యేయంగా  ప్రతి ఎకరాకు నీరు, ప్రతి రైతుకు భరోసా కల్పించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. నీటి సంరక్షణ కోసం ప్రజా ఉద్యమం ప్రారంభించామన్నారు.  60 వేల మంది సాగునీటి సంఘాల సభ్యుల సారథ్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. 2024లో అనంతపురం జిల్లాలో 13.36 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు .సమర్థవంతంగా  నీటి నిర్వహణ ద్వారా 2.11 మీటర్ల మేర పెరిగి నేడు 11.25 మీటర్లకు చేరుకున్నాయన్నారు.  నీరు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, పరిశ్రమలు వస్తాయని, సంక్షేమం-సంపద లభిస్తుందన్నారు. ఒకప్పుడు ఎడారిగా మారుతుంది అని అంతా భయపడిన ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం నీటి నిర్వహణ, సంరక్షణ చర్యలతోనే ఉద్యాన రంగంలో అగ్రగామిగా నిలిచిందన్నారు.  దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు, ప్రభుత్వ అధికారులు, సాగునీటి సంఘాలు కలిసి అడుగేసి రానున్న రోజుల్లో భూగర్భ జలాలు పెంపుతో రికార్డులు సృష్టించాలని ఆకాంక్షించారు. అనంతపురంలో జరిగిన జలధార- నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో  ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. నీరు మనందరికీ సర్వస్వం… దానిని సంరక్షించుకోడానికే 100 రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసమే పనిచేస్తున్నాం. ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్ లు, తుంపర సేద్యం, సూక్ష్మసేద్యం లాంటి అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. అనంతపురం లాంటి ప్రాంతాల్లో కొన్ని ఏళ్లపాటు నీరే లేదని  నష్ట పోతున్న రైతులను ఆదుకోడానికి ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చింది కూడా టీడీపీనేనని గుర్తు చేశారు. అనంతపురం జిల్లాలో నీటిని సద్వినియోగం చేసుకోవాలని డ్రిప్ ఇరిగేషన్ కార్యక్రమం తీసుకువచ్చామన్నారు. ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్ లో రూ.1,031 కోట్లు వ్యయం చేస్తూ దేశంలో నెంబర్ వన్ గా ఉన్నామన్నారు. డ్రిప్ ఇరిగేషన్ వల్లే రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా మారిందన్నారు.  హార్చికల్చర్‌లో దేశంలో అగ్రస్థానంలో ఉన్నాం. పూర్వోదయ స్కీమ్ ద్వారా కేంద్రం నుంచి రూ.30 వేల కోట్లు, ప్రైవేటు ద్వారా మరో రూ.70 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. అన్నమయ్య జిల్లాల్లో దీనిని ఓ ప్రజాఉద్యమంగా చేపట్టి విజయం సాధించారన్నారు. అన్నమయ్య జిల్లాలో 5.7 టీఎంసీల నీళ్లు అందుబాటులోకి వచ్చాయి. 20 వేలకు పైగా బోర్లలో నీరు అందుబాటులోకి వచ్చింది. ఒక్క జిల్లాలో 96  కోట్ల వరకు  విద్యుత్ ఆదా అయ్యిందన్నారు. భూగర్భజలాలు పెరగటం మూలంగా గ్రీనరీ పెరిగిందని  ఇవన్నీ సానుకూలమైన అంశాలు అని తెలిపారు. వర్షాకాలం కంటే ముందు 6 మీటర్ల లోతున, ఆ తర్వాత 3 మీటర్ల కంటే తక్కువగా భూగర్భ జలాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఇలా చేయగలిగితే రాష్ట్రంలో నీటి ఎద్దడి అనేది ఉండదని స్పష్టం చేశారు. శ్రీశైలం నీటిని వేర్వేరు చోట్ల ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి నీరు తెచ్చుకుంటున్నామన్నారు.  రాష్ట్రంలోనూ, రాయలసీమలోనూ ప్రతీ ఎకరాకూ నీరు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని భరోసానిచ్చారు. దేశంలోనే అతితక్కువ వర్షపాతం పడే అనంతపురం జిల్లా కూటమి ప్రభుత్వం చూపిన చొరవ కారణంగా ఎక్కువ పండ్ల తోటలతో సంపన్నమైన ప్రాంతంగా మారిందన్నారు. గత పాలకులు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. రూ.1.24 లక్షల కోట్ల మేర అప్పులు చేశారని మండిపడ్డారు.  కూటమి వచ్చాక వారు పెంచిన రూ.4,600 కోట్ల భారాన్ని కూడా ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. మొదటి సారి విద్యుత్ ఛార్జీల ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. భూమినే జలాశయంగా మార్చుకుని వినియోగించు కోవటం ద్వారా మెరుగైన నీటి నిర్వహణ చేపట్టవచ్చన్నారు. జలం మనకు ఓ సంపద. దానిని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత సంపద సృష్టిస్తుందిన్నారు. ఇప్పుడు మీ రాజధాని ఏదంటే అమరావతి అని గర్వంగా చెప్పే రోజు వచ్చిందన్నారు. రాజధాని అంశంలో వైసీపీ తీరుపై మండిపడ్డారు. గతంలో మూడు ముక్కలాట ఆడారని ఎద్దేవా చేశారు.  ఇక మనకు ఒక్కటే రాజధాని నగరమని పునరుద్ఘాటించారు. పార్లమెంటులో 50 పార్టీలు ఉంటే అందులో వైసీపీ మినహా 49 పార్టీలు అమరావతికి మద్దతు పలికారని వైసీపీ మాత్రమే రాష్ట్రానికి ద్రోహం చేసిందని మండిపడ్డారు. పిచ్చి ముదిరి మావిగన్ అంటూ పేరు పెట్టారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  2047 నాటికి ఏపీని అగ్రస్థానంలోకి తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *