భారత దిగ్గజ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా, ఆయనకు కేంద్ర ప్రభుత్వం ‘ఎక్స్’ కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది. పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయన భద్రత నేపథ్యంలో ఆయన సెక్యూరిటీకి సంబంధించి ఈమేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గత వారం ఆయన ఢిల్లీలో బీజేపీలో చేరారు. గతంలో తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నారు. ఇక ఈ సారి బెంగాల్ అసెంబ్లీ ముందు ఆయన బీజేపీలో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్రం ఆయనకు ‘ఎక్స్’ కేటగిరీ భద్రత కింద రక్షణ కల్పించనుంది. కోల్ కతాలో పుట్టిన లియాండర్ పేస్ భారత టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. టెన్నిస్ లో ఆయన 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ కైవసం చేసుకున్నారు. వాటిలో 10 మిక్సెడ్ డబుల్స్ లో 8 మెన్స్ డబుల్స్ లో గెలిచారు. ఇక పేస్ ఇమేజ్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కలిసొస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బెంగాల్ లో ఈ నెల 23న, 29న రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.