ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 15 వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం 

Spread the love

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 15 వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాలకు చెందిన వివిధ పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, పి.నారాయణ, కే.అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్ధన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. 

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమే పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ప్రాతిపదిక కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టులు త్వరితగతిన కార్యరూపం దాల్చాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటివరకు ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల యాజమాన్యాలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరిపి ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తి చేసేలా చూడాలన్నారు. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాలకు చెందిన 27 ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. రూ.29,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు 15 వ ఎస్ఐపిబి సమావేశం ఆమోదం తెలియచేసింది. వీటి ద్వారా 22,407 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.  ప్రతిష్టాత్మక సంస్థలైన గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్, బీపీసీఎల్ వంటి మెగా ప్రాజెక్టులు వరుసగా ఏర్పాటు కావాల్సి ఉందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు.భూ కేటాయింపులు జరిపినప్పటికీ నిర్ణీత కాల వ్యవధిలో పనులు ప్రారంభించని సంస్థలతో సంప్రదింపులు జరపాలని, నిర్మాణానికి ముందుకు రాకుంటే భూములు వెనక్కి తీసుకునేందుకు వెనకాడవద్దని స్పష్టం చేశారు. దీనిపై మంత్రుల కమిటీ దృష్టి పెట్టి..అవసరమైతే అనుమతులు రద్దు చేయాలన్నారు. ప్రతీ ఒప్పందమూ వేగంగా సాకారం కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేలా ఎన్నారైలను ఆహ్వానించాలని అధికారులను సీఎం నిర్దేశించారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులు మరిన్ని వచ్చేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అలాగే సొంత భూముల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునేవారికి అదనపు ప్రోత్సాహకాలు అందించే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం  సూచించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *