భారతదేశ ప్రపంచ వాణిజ్య ప్రస్థానంలో నేడు ఒక కొత్త అధ్యాయం మొదలైంది, ఇది ఒక భారీ ముందడుగని ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. భారత్-ఈయూ (India-EU) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఒక వ్యూహాత్మక మైలురాయి. ఇది భారతీయ పరిశ్రమలను ప్రపంచ మార్కెట్ల వైపు వేగంగా తీసుకెళ్తుందని లోకేష్ పేర్కొన్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లోని సముద్ర ఆహార ఉత్పత్తులు (Seafood) మరియు వ్యవసాయ ఉత్పత్తుల వంటి పలు రంగాలు ఐరోపా మార్కెట్లకు మరింత చేరువై తద్వారా ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ ఒప్పందం సుమారు 75 బిలియన్ డాలర్ల ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే MSMEలు, మహిళలు, చేతివృత్తిదారులు, యువత మరియు నిపుణులకు భారీ ఊతాన్ని ఇస్తుందని వివరించారు. భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశంలో ఈ చారిత్రాత్మక మైలురాయిని ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ గారికి లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలిపారు.