నటి సమంతకు అరుదైన గౌరవం..రాష్ట్రపతి విందుకు ఆహ్వానం

Spread the love

తనదైన నటనతో పలు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్న ప్రముఖ నటి సమంతకు అరుదైన గౌరవం దక్కింది. 77వ రిపబ్లిక్ డే సందర్భంగా ఆమెకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ విందుకు ఆహ్వానం అందింది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి హాజరైన సమంత సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన కెరీర్ లో ఇలాంటి ఒక రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదని, తన అదృష్టం, మాతృభూమి వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్‍స్టాగ్రామ్‌లో ఆమె స్పందిస్తూ, ఎప్పటికైనా ఇలాంటి వేదికపై నిలుచుంటానని నా అంతరాత్మ కూడా చెప్పలేదు. ఎలాంటి మార్గం కనిపించలేదు. ఇలాంటి కలలు కనడానికి కూడా అప్పట్లో సాహసించలేదు. కానీ నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్లాను. ఈ దేశం తన  కృషికి తగిన గుర్తింపు ఇచ్చిందని అందుకు  దీనికి ఎప్పటికీ రుణపడి ఉంటానని రాసుకొచ్చారు.ఈ కార్యక్రమానికి సమంత సంప్రదాయబద్ధంగా హాజరయ్యారు.. రాష్ట్రపతి భవన్‌లో దిగిన పలు ఫొటోలను, విందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని కూడా ఆమె షేర్ చేశారు. ఈ విందులో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ సహా జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్నారు.