యువత ఏ ఒక్క భావజాలాన్ని గుడ్డిగా నమ్మవద్దని ఎవరి ఐడియాలజీని గుడ్డిగా నమ్మి ప్రభావితం కావద్దు. మీరు ప్రభావితం అయిన భావజాలం ఈ కాలానికి సరిపోతుందా? లేదా అనేది ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందుకు వెళ్లాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ యువతకు పిలుపునిచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్బంగా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. భావోద్వేగాలతో కాకుండా వాస్తవికత ఆధారంగా ఆలోచనలు చేయాలని ప్రపంచాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధం విద్య అని, సమాజ సేవే యువత ధ్యేయం కావాలని కోరారు. తన ఆఖరిశ్వాస వరకు భవిష్యత్ తరాల కోసమే పని చేస్తానని తెలిపారు. ఈ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. యూనివర్శిటీ గురించి మాట్లాడుకోవాలంటే మొదట చిహ్నం గురించి మాట్లాడుకోవాలని ఆంధ్ర యూనివర్సిటీ లోగోను ప్రత్యేక శ్రద్ధతో తయారుచేశారన్నారు. ఆ లోగోను విపులంగా వివరించారు. వేలాది మంది మేధావులను సమాజానికి అందించిన సంస్థ ఏయూ అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా విద్యనందించే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు చాలా ఉన్నప్పటికీ, కొన్ని తరాలను తీర్చిదిద్దుతూ అద్వితీయమైన జ్ఞానాన్ని అందించే విద్యా సంస్ధలు కొన్నే ఉన్నాయన్నారు. ఈ కొద్ది సంస్థల్లో శతాబ్ద కాలంపాటు ఎన్నో వేల మంది మేధావులను సమాజానికి అందించిన చరిత్ర ఆంధ్ర విశ్వకళా పరిషత్, ఆంధ్ర యూనివర్శిటీకే దక్కుతుందన్నారు. ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయం కేవలం ఒక ప్రాంగణం మాత్రమే కాదని విలువలతో వ్యక్తిత్వంతో దేశ నిర్మాణంలో భాగస్వామ్యంగా నిలిచి, శతాబ్దకాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భారతీయ వారసత్వ సంపదకు చిహ్నమని పేర్కొన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం ప్రపంచ శక్తిగా నిలిస్తే, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. నిరంతర కృషి, నిబద్దతతో ముందు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. దేశం యొక్క అభివృద్ధి యువత మీద ఆధారపడి ఉంటుందన్నారు. వారి శక్తి, ఉత్సాహం, సృజనాత్మకత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.