ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో 60 కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం, భారీ ఇన్వెస్ట్మెంట్స్ ను ఆకర్షించడం, హయ్యర్ ఎడ్యుకేషన్ లో సంస్కరణలు వంటి ముఖ్యమైన అంశాలపై మంత్రివర్గం దృష్టి సారించింది. ఈ క్యాబినెట్ భేటీలో ప్రధానంగా, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ చేసినందుకు గాను ప్రధానమంత్రి మోడీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అమరావతి బిల్లుకు పార్లమెంటులో సపోర్ట్ చేసిన అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఇక రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చేలా, 16వ స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో చర్చించిన రూ.39 వేల కోట్లకు పైగా విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదించింది. విశాఖపట్నంలోని క్వాంటం వ్యాలీలో మూడు సంస్థల ఏర్పాటుకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 14న క్వాంటం కంప్యూటర్స్‌కు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమానికి కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.