40ఏళ్ల నట ప్రస్థానం..శివరాజ్ కుమార్ కు డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు

Spread the love

కన్నడ అగ్రనటుడు శివరాజ్ కుమార్ సినీ రంగంలో 40 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సినీ రంగంలో నాలుగు అద్భుతమైన దశాబ్దాలను పూర్తి చేసుకున్న కన్నడ చక్రవర్తి శ్రీ శివ రాజకుమార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. నా అభిమాన హీరో, కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజకుమార్ గారి వారసత్వాన్ని ఆయన ఎంతో గర్వంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన మరెన్నో విజయాలు సాధించాలని, సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని కోరుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు. 

కన్నడ చలనచిత్ర దిగ్గజం డాక్టర్ రాజ్‌కుమార్ పెద్ద కుమారుడైన శివరాజ్ కుమార్, తన తండ్రి వారసత్వాన్ని అద్భుతంగా కొనసాగిస్తూనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. 1986లో ‘ఆనంద్’ చిత్రంతో అరంగేట్రం చేసిన ఆయన, తన తొలి మూడు చిత్రాలతోనే హ్యాట్రిక్ సాధించి సంచలనం సృష్టించారు. ముఖ్యంగా ‘ఓం’ సినిమాతో కన్నడ చిత్రసీమలో తనదైన నటనతో సత్తా చాటారు. దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్‌లో 125కు పైగా సినిమాల్లో నటించిన ఆయన, ఇప్పటికీ అదే ఎనర్జీతో  దూసుకుపోతున్నారు. కేవలం కన్నడలోనే కాకుండా, ఇటీవలే ‘జైలర్’ వంటి సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను కూడా తన నటనతో మరియు స్క్రీన్ ప్రెజెన్స్‌తో మంత్రముగ్ధులను చేశారు. ఆయన క్రమశిక్షణ, సరళత మరియు తోటి నటుల పట్ల చూపే గౌరవం ఆయన్ని నిజమైన ‘సినిమా చక్రవర్తి’గా నిలబెట్టాయి. రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ లో కూడా ఆయన కీలక పాత్రలో కనిపించనున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *