భూ మాతను రక్షించుకుంటూ అన్నదాతల ఆదాయం పెంచాలి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

Spread the love

ఉద్యాన సాగులో వైవిధ్యం… భూమికి రక్షణ కవచం లాంటిదని విభిన్న రకాల పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి  పవన్ కళ్యాణ్ అన్నారు. అటవీ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు.  భూ మాతను రక్షించుకుంటూ, రైతుల ఆదాయం పెంచే విధంగా ప్రణాళికలకు రూపకల్పన చేయాలని స్పష్టం చేశారు. పండ్ల తోటల్లో విభిన్న జాతుల మొక్కలు సాగు చేయడం ద్వారా భూసారాన్ని పెంచడంతోపాటు వాతావరణాన్ని రక్షించుకోవచ్చని తెలిపారు. ఈరోజు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో 50 శాతం గ్రీన్ కవర్ ప్రణాళికలపై అటవీ, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ అంశాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చర్యల్లో భాగంగా ఈ సమావేశం జరిగింది.  గ్రీన్ కవర్ పెంపులో ఉద్యాన శాఖ పాత్ర, పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం తదితర అంశాలపై పవన్ దిశానిర్దేశం చేశారు. 

గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ సాధన అంశాలను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం అన్ని ప్రభుత్వ రంగ శాఖలు అటవీ శాఖతో సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు.  గ్రీన్ కవర్ ఏర్పాటులో ఉద్యానవన శాఖ పాత్ర కీలకమని ఉద్యాన పంటల సాగులో వైవిధ్యం తీసుకురావడం ద్వారా అటు రైతుకీ, ఇటు భూమికీ ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఒకే పంటలో వివిధ రకాల జాతుల మొక్కలు అంతర పంటలుగా సాగు చేసే విధంగా రైతులను పోత్సహించాలన్నారు.  సింథటిక్ మందుల వినియోగం తగ్గించేలా అవగాహన కల్పించాలన్నారు.  తద్వారా భూమికి చేవ పెరుగుతుంది. జీవవైవిధ్యాన్ని రక్షించుకోవచ్చని అన్నారు.