2027 మార్చ్ కి పోలవరం అన్ని పనులు పూర్తి:ఏపీ సీఎం చంద్రబాబు

Spread the love

2027 మార్చ్ కి పోలవరం అన్ని పనులు పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టులో 87 శాతం మేర సివిల్ పనులు పూర్తి అయ్యాయని, గడువులోగా మిగతా పనులు పూర్తి చేయాలని సీఎం  చంద్రబాబు ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వం వల్లే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి ఆరేడు ఏళ్లు ఆలస్యమైందన్నారు. నిర్వాసితుల పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని సూచించారు. పోలవరం ఎడమ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, కుడికాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు కూడా నీరు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు సైట్ వద్ద నేడు సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్ధసారధి, నాదెండ్ల మనోహర్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చని  నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దని తెలంగాణను సీఎం చంద్రబాబు కోరారు. రాజకీయ నేతలు పోటీపడి మాట్లాడటం సరికాదు. అక్కడి ప్రజలు కూడా ఆలోచించాలి. తెలుగు జాతి ఒక్కటే.. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని  ఇద్దరి మధ్య విరోధాలు పెరిగి ఆనందించే పరిస్థితి రాకూడదని విజ్ఞప్తి చేశారు.  ఎమోషన్స్ తో  ఆటలు ఆడటం మంచిది కాదు. ప్రజల కోసం రాజకీయాలు చేస్తే మంచిదే. ఆర్టీఎస్ లో నీళ్లు రాకుంటే జూరాల నుంచి నీళ్లు తెచ్చి మహబూబ్నగర్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.  దేవాదుల, కల్వకుర్తి తానే  ప్రారంభించానన్నారు. గోదావరి నదికి ఎగువన దేవాదుల ప్రాజెక్టు ఉంది. దేవాదుల నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. కిందకు వచ్చే నీళ్లకు మీరు అభ్యంతరం చెబితే ఏమైనా అర్థం ఉందా? అని ప్రశ్నించారు. ఆరోజు మంజీరాకు నీళ్లు తీసుకెళ్లారని పేర్కొన్నారు.  అప్పుడు స్వాగతించాం. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని  పూర్తి చేసుకోవాలన్నారు.  దేవాదులకు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని అన్నారు. నీళ్లు పొదుపు చేస్తే తెలంగాణకు కూడా లబ్ధి కలుగుతుందన్నారు.