ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో సంక్రాంతి సంబరాలలో పాల్గొనేందుకు రానున్నారు. ఈ వార్తా ఆయన అభిమానులకు పండగనే చెప్పాలి. పవన్ రాకతో ఈ సంక్రాంతికి మరింత శోభను సంతరించుకుంటోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మూడు రోజులపాటు ఇక్కడ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే సంక్రాంతి సంబరాలను పవన్ కళ్యాణ్ ఈ నెల 9న ప్రారంభించనున్నారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద మున్సిపల్ పాఠశాల క్రీడా మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. అదే రోజు నియోజకవర్గంలో రూ.200 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు పట్టణంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గ స్వరూపాన్నే అనతికాలంలో మార్చేశారు పవన్. రహదారులు మౌలిక వసతుల కల్పనలో గణనీయంగా మార్పులు వచ్చాయి. దీంతో ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. నమ్మి గెలిపించినందుకు పవన్ న్యాయం చేస్తున్నారంటూ ప్రజలు స్పందిస్తున్నారు.