తీర ప్రాంత రక్షణ, జీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకోసం సమష్టిగా పని చేద్దామని అటవీ శాఖ సిబ్బందికి పిలుపునిచ్చారు. మడ అడవుల పెంపుదల – సుస్థిర ఆదాయం జాతీయ స్థాయి వర్క్ షాప్ లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రేట్ గ్రీన్ వాల్ ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. 1052 కిలోమీటర్ల ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత రక్షణకు మడ అడవులు బలమైన గోడల్లాంటివి… వీటిని పెంపొందించడంలో, రక్షించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధిగా పని చేస్తుందని చెప్పారు. రాష్ట్రానికి తుపానుల ప్రభావం చాలా అధికం. దీనివల్ల ప్రతి ఏటా అపార నష్టం జరుగుతుంది. ముఖ్యంగా గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలో తుపానుల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి మడ అడవులను సమృద్ధిగా పెంచడం అనేది కీలకం. మడ అడవుల పెంపకంలో జీవ వైవిధ్యాన్ని రక్షించాలి. మడ అడవులను కొత్తగా పెంచడంతోపాటు, ఉన్న మడ అడవులను కాపాడుకోవడం ప్రధానం. 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర ప్రాంతంలో సుమారుగా 700 హెక్టార్లలో మడ అడవులను పెంచింది. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామన్నారు. మడ అడవులను పెంపకం లో గాని, తీరప్రాంతాన్ని రక్షించడంలో గాని మూడు దశలుగా గ్రీన్ బెల్టు అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం. దీనిలో తీర ప్రాంతవాసులను కూడా మమేకం చేసి వారి జీవన ప్రమాణాలు పెరిగేలా వారికి సుస్థిరమైన ఆదాయం అందేలా ప్రయత్నాలు చేస్తున్నాం. తీర ప్రాంతంలో పెంచే అడవుల నుంచి ఆదాయం వచ్చే పద్ధతుల మీద స్కిల్ డెవలప్మెంట్ పెంచుతాం. వారికి తగిన ప్రోత్సాహకాలు అందిస్తూ మార్కెటింగ్ మీద దృష్టి సారిస్తాం. ఎకో టూరిజం అభివృద్ధి చేసి ఆదాయం పొందే మార్గాలను తయారు చేస్తాం. గ్రేట్ గ్రీన్ వాల్ విభిన్నమైన కార్యక్రమమని అన్నారు. అటవీ శాఖ సిబ్బందికి తన అండ ఎల్లప్పుడూ ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ పునరుద్ఘాటించారు. వ్యవస్థల్ని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇతర రాష్ట్రాల సాయం తీసుకుంటామన్నారు. అటవీ శాఖ అన్ని శాఖలను సమన్వయం చేసుకొని లక్ష్యాన్ని సాధించాలన్నారు.