
ఆ నియోజకవర్గం అసలు సిసలు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. వైద్యులే అక్కడ ఎమ్మెల్యే కావటం ప్రత్యేకత. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. డాక్టర్ ఎమ్మెల్యేగా ఉండాల్సిందే. అక్కడి రాజకీయాలు కూడా చాలా హాట్ హాట్ గా ఉంటాయి. సామాజిక వర్గాల ప్రభావం చాలా ఎక్కువ. పార్టీ ఏదైనా వర్గమే ముఖ్యం. అలాంటి ఆ నియోజకవర్గంలో వరుసగా గెలుస్తూ వస్తున్న వర్గాలను కాదని.. బీసీ నేతకు ప్రజలు పట్టం కట్టారు. అయితే, ఆ ఎమ్మెల్యేకు ఇప్పుడు కొందరు సొంత పార్టీ నేతలే విపక్షంగా మారారా? తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం ఒంటరి పోరాటం చేస్తున్నారా?ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏదా ఆ నియోజకవర్గం?..అసలు ఏం జరుగుతోంది..? లెట్స్ వాచ్ దిస్ ఓటీఆర్
పల్నాడు జిల్లా నడిబొడ్డు నరసరావు పేట నియోజకవర్గం. ఇక్కడ నాటి కోడెల నుంచి నేటి అరవింద్ బాబు వరకు అందరూ డాక్టర్లే. వైద్య వృత్తిలో ఉన్నవారే ఇక్కడ గెలుస్తూ ఉండటం ఈ నియోజకవర్గ ప్రత్యేకత. ఇక, ప్రస్తుత రాజకీయాలకు వస్తే..వరుసగా రెండు సార్లు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని ఓడించిన టీడీపీ అభ్యర్ధి డాక్టర్ అరవింద్ బాబు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. తొలి నుంచి కార్యకర్తలతో మమేకం అవుతూ..వారి కోసం ఎందాక అయినా వెళ్లేందుకు సిద్దంగా ఉండే నేత అరవింద్ బాబు. కార్యకర్తలు తమ ఎమ్మెల్యే మీద అదే అభిప్రాయంతో ఉన్నారు. తన నియోజకవర్గంలోని ఓ కార్యకర్తకు ఉద్యోగం కోసం నేరుగా రాష్ట్ర స్థాయి అధికారులను నిలదీసిన ఎమ్మెల్యేగా వార్తల్లోకి ఎక్కారు అరవింద్ బాబు.
లిక్కర్ డిపోల్లో నాటి వైసీపీ కార్యకర్తలను తొలిగించి.. తమ పార్టీ వారికి అవకాశం కల్పించాలని నేరుగా వెళ్లి ఆ శాఖ ఉన్నతాధికారులను నిలదీసారు ఎమ్మెల్యే అరవింద్ బాబు. అయితే, సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువ గా ఉండే ఈ నియోజకవర్గంలో వారి ప్రభావం ఎమ్మెల్యేను వదల్లేదు. ఇక్కడ ఎప్పుడూ రెండు ప్రధాన వర్గాలకు చెందిన వారే ఎమ్మెల్యేలు అవుతూ వచ్చారు. ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన డాక్టర్ అరవింద్ బాబుకు సొంత పార్టీలోని ఒక మెజార్టీ వర్గానికి చెందిన నేతలు సమస్యలను తెచ్చి పెడుతున్నట్లు సమాచారం. అరవింద్ బాబు చెప్పిన పనులు పూర్తి కానీయకుండా.. ఆయన నిర్ణయాలను అమలు కాకుండా తెర వెనుక రాజకీయాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒక వైపు ప్రతిపక్షం..మరోవైపు ఇటు సొంత పార్టీలోని విపక్షం చేస్తున్న తెరవెనుక రాజకీయాలతో అరవింద్ బాబు రాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
నియోజకవర్గంలోని అధికార పార్టీలోని ముఖ్య నేతల మధ్య సఖ్యత ఉండటం లేదని టాక్. ఒకరంటే మరొకరికి పొసగని పరిస్థితి ఉందట. ఎమ్మెల్యేను డమ్మీ చేసి పెత్తనం చేసేందుకు కొందరు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలోని టీడీపీ నేతలు కోడెల శివ రాం, కడియాల వెంకటేశ్వరరావు తో పాటుగా నర్సరావు పేట ఎంపీ లావు శ్రీ క్రిష్ణ దేవరాయులు..అదే విధంగా జిల్లా ఇంఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవి సైతం ఎమ్మెల్యేను పట్టించుకోవటం లేదనే వాదన పార్టీ కార్యకర్తల్లో వినిపిస్తోంది. ఎమ్మెల్యే నిర్ణయాలు అమలు కాకుండా..వారి పెత్తనం నియోజక వర్గం లో పెరిగిపోయిందనే టాక్ మొదలైంది. ఇప్పటికే నర్సరావుపేట డ్రైనేజ్, నియోజకవర్గం అభివృద్ధి కీలకంగా మారాయి. వీటి విషయంలో ఎమ్మెల్యే ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్.
పార్టీకి అంకితభావంతో ఉంటూ..కార్యకర్తల కోసం నిలబడుతున్న ఎమ్మెల్యేను సొంత పార్టీకి చెందిన ఒక వర్గం నేతలు ఉద్దేశ పూర్వకంగా ఇబ్బంది పెడుతున్న వ్యవహారం పార్టీ హైకమాండ్ వరకు వెళ్లిందట. అయితే ఇప్పటి వరకు చర్యలు లేవని కార్యకర్తల్లో టాక్ . మరి, ఇప్పటికైనా హైకమాండ్ పరిస్థితుల్లో మార్పు తెస్తుందా..లేదా అనేది కాలమే తేల్చాలి.