అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి 

Spread the love

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఇక ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించాలని విభజన చట్టంలో చేర్చాలని కోరారు. పార్లమెంట్ ద్వారా అమరావతికి చట్టబద్దత కల్పిస్తే రాష్ట్రంలో అభివృద్ధి మరింత బాగా జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆశ కూడా నెరవేర్చినట్లవుతుందని చెప్పారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు. 

కొత్తగా తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం కింద చేపట్టే పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 రేషియోలో  వాటా సమకూర్చాల్సి ఉంది. దీనిలో ఏపీకి ప్రత్యామ్నాయ వెసులుబాట్లు కల్పించాలని కోరారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో ఏపీకి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సభ్యుడిగా ఉన్న అమిత్ షాకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి తెలిపి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. పరిపాలన అవసరాల దృష్ట్యా రెండు కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లలో చేసిన మార్పుచేర్పుల గురించి కేంద్రమంత్రి అమిత్ షా దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన మౌలిక వసతులను పునరుద్ధరించేందుకు మూలధన వ్యయం కోసం ఆర్థిక వనరులు కల్పించాలని కోరారు.