ఏ ఫార్మాట్ అయినా తన బ్యాట్ జోరు తగ్గేదే లే అంటూ అదరగొడుతున్నాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. వరుస సెంచరీలతో చెలరేగుతున్న వైభవ్ సౌతాఫ్రికా అండర్-19 వన్డే సిరీస్లో మరో విధ్వంసక ఇన్నింగ్స్ తో చెలరేగాడు. మూడో యూత్ వన్డేలో కెప్టెన్ సూర్యవంశీ (127; 74 బాల్స్ లో 9×4, 10×6) సెంచరీతో సత్తాచాటగా.. అతనికి తోడు మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ (118; 106 బాల్స్ లో 16×4) కూడా సెంచరీతో రాణించడంతో భారత్ 233 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్లకు 393 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన వైభవ్, జార్జ్ జోడీ తొలి వికెట్ కు 25.4 ఓవర్లలో 227 పరుగుల పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎన్టండో సోని (3/61) జేసన్ రోల్స్ (2/59) మినహా బౌలర్లంతా పరుగులు ఇచ్చుకోవడంలో పోటీపడ్డారు. 63 బంతుల్లోనే సెంచరీ అందుకున్న వైభవ్ మరింత వేగంగా ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు. అతడు వెనుదిరిగాక పరుగుల వేగం కాస్త తగ్గింది. భారీ లక్ష్య ఛేదనలో సఫారీ జట్టు చతికిలపడింది. 35 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. డానియల్ బోస్మన్ (40), పాల్ జేమ్స్ (41), కార్న్ బోథా (36) పర్వాలేదనిపించారు. కిషన్ సింగ్ (3/13) మొహమ్మద్ ఎనాన్ (2/36) రాణించారు. వైభవ్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులను కైవసం చేసుకున్నాడు.