ఎమ్మెల్యేకు చెక్ ..?

Spread the love

Deputy CM Pawan Kalyan: కాకినాడ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ స్పెషల్ ఫోకస్ పెట్టారా..? ఆ ఎమ్మెల్యేపై అసమ్మతి నేతలు కూనీ రాగాలు ఎందుకు తీస్తున్నారు..? తానొకటి తలిస్తే దైవం మరొకటి చేసింది అన్నట్టుగా ఆయన పరిస్థితి తయారైందా..? ఆ ఎమ్మెల్యేకే ఈ పరిస్థితి ఎందుకు ఎదురైంది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కాకినాడ నగరం… కాకినాడ జిల్లా కేంద్రం కూడా. స్మార్ట్ సిటీ కూడా. కాకినాడ ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ సమీకరణాల నేపథ్యంలో ఆయనకు పదవి దక్కలేదు. పైగా అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కూడా పూర్తికాలేదు. పూర్తి అసమ్మతితో నలిగిపోతున్నారు. తాను ఒకటి అనుకుంటే మరొకటి జరిగిపోతోందంటూ తమ నాయకుడు ఇబ్బంది పడుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇంటా, బయట అసమ్మతి పెరిగిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి తమ ఎమ్మెల్యేకు ఏర్పడిందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు.అంతకుముదు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి భావనతో ఎమ్మెల్యేకు పడేది కాదు. ఆమె విధుల్లో చేరింది మొదలు ఆమెను బదిలీ చేయాలంటూ విశ్వ ప్రయత్నాలు చేశారు. సాక్షాత్తు జిల్లా ఇంచార్జ్ మంత్రి నారాయణ కలిసి కమిషనర్ ను బదిలీ చేయాల్సిందేనని పట్టుబట్టారు. అయినా ప్రభుత్వం మార్చలేదు.. దీంతో ఎమ్మెల్యే అలిగారు కమిషనర్ ను బదిలీ చేశారు. బాపట్ల జాయింట్ కలెక్టర్ గా ఆమె వెళ్లారు.

ఆమె స్థానంలో ఎవరిని కొత్త కమిషనర్ గా నియమించలేదు. దీంతో గతంలో ఎమ్మెల్యే సిఫార్సు చేసి తెచ్చుకున్న అదనపు కమిషనర్ సుధాకర్ కు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. కానీ ఇంతలోనే ఎమ్మెల్యే కొండబాబుకు చుక్కెదురైంది. కాకినాడ నగరపాలక సంస్థ కాలపరిమితి ముగిసి మూడేళ్లయినా ఎన్నికలు పెట్టలేదు. ప్రస్తుతం జిల్లా కలెక్టరే ప్రత్యేక అధికారిగా ఉన్నారు. దాంతో ఆయనను మరో నెలలు ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ లు తనకు అయ్యా.. ఎస్ అనడం లేదు. అందుకు నాన్ ఐఏఎస్ కావాలని ఎమ్మెల్యే పట్టుపట్టి కమిషనర్ ను బదిలీ చేయించారు. కానీ ప్రత్యేక అధికారిగా తిరిగి ఐఏఎస్ అధికారి కలెక్టర్ షామ్మోహన్ బాధ్యతలు చేపట్టారు. అదనపు కమిషనర్ చేసేదేమీ ఉండదు. స్పెషల్ ఆఫీసర్ చెప్పిందే చేయాలి. కథ కంచికి చేరింది అనుకుంటే మొదటికి వచ్చిందని ఆయన అనుచరులు వాపోతున్నారు.

ప్రస్తుతం కలెక్టర్ షామ్మోహన్ జిల్లాలో అందరూ ఎమ్మెల్యేలను పెద్దగా పట్టించుకోవడం లేదన్న టాక్ ఉంది. ఆయనకు ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తో మంచి అనుబంధం ఉంది. దీంతో ఎమ్మెల్యే ఏదైనా చెప్పినా వెంటనే ఆయన డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తారు. ఎందుకంటే కాకినాడ జిల్లాకు డిప్యూటీ సీఎం ఒక్కరే మంత్రిగా ఉన్నారు. తన విషయాలన్నీ కలెక్టర్ పవన్ కు చెబుతారన్న ఆందోళన కూడా ఎమ్మెల్యేలు ఉందని ఆయన అసమ్మతి వాదులు చర్చించుకుంటున్నారు. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కాకినాడ కలెక్టర్ ను ప్రతి సమావేశంలో ప్రశంసిస్తుంటారు. ఆయన పనితీరును మెచ్చుకుంటారు. గతంలో ఆయనను ప్రభుత్వం బదిలీ చేయాలి అనుకున్నా పవన్ కళ్యాణ్ ఆయన బదిలీని ఆపారని ప్రచారం. కలెక్టర్ షామ్మోహన్ జిల్లా కలెక్టర్ కాదు .. పిఠాపురం కలెక్టర్ అంటూ జిల్లా అధికారులే వ్యాఖ్యానిస్తారు. సిటీ ఎమ్మెల్యే కార్పొరేషన్ పై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే చర్చ జరుగుతోంది.

మరోపక్క ఎమ్మెల్యే కొండబాబుపై అసమ్మతి పెరిగిపోయింది. ఇప్పటికే సోదరుడి కుమారుడు ఉమాశంకర్ పక్కలో బల్లెంలా తయారయ్యాడు. ఎక్కడికక్కడ కేడర్ ను కలుపుకొని తన వర్గాన్ని పెంచుకుంటున్నాడు. ఇంకోపక్క జనసేనతో తీవ్ర విభేదాలున్నాయి. జనసేనకు చెందిన మత్స్యకారులు ఎమ్మెల్యే కొండబాబు అంటే భగ్గుమంటున్నారు. ఆయన తమను పట్టించుకోవడం లేదు. తమకు పదవులు ఇవ్వడం లేదు. తాము కూడా ఆయనతో కలిసి వెళ్ళేది లేదని బహిరంగ సమావేశంలో జనసేన మత్స్యకారులు ప్రకటన చేశారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కొండబాబు వాడబలిజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. వారికి ఎలాంటి పదవులు ఇవ్వడం లేదని మత్స్యకార సామాజిక వర్గంలో మరో వర్గమైన వాడబలిజలు కూడా ఆగ్రహంతోనే ఉన్నారు. ఆయన పరిస్థితి అలా తయారయిందని ఆయన వెంట ఉన్న వారు చెబుతున్నారు.

పోనీ ఆయన ఏరి కోరి తన వర్గంగా చెప్పుకునే వారికి పదవులు ఇచ్చారు. కానీ కొండబాబుపై అసమ్మతి నేతలు, జనసేన నాయకులు ఆరోపణలు చేసినప్పుడు వారు పెదవి విప్పడం లేదు. కొండబాబుకు మద్దతుగా మాట్లాడడం లేదు. అలాగే జనసేన కాకినాడ ఇంచార్జ్, పౌరసరఫరాల శాఖ చైర్మన్ తోట సుదీర్ తో అసలు పడడం లేదు. జనసేన నుంచి ఆయన పౌరసరఫరాల శాఖ రాష్ట్ర చైర్మన్ గా ఉంటూనే కాకినాడ నగరంలో ఎమ్మెల్యేని కాదని కాకినాడ సంత చెరువు వద్దనున్న దేవాదాయ శాఖ కనకదుర్గ ఆలయానికి చైర్మన్ గా కూడా తనకే పదవి తెచ్చుకున్నారు. జోడు పదవులలో కొనసాగుతున్నారు. తన అనుచరులని ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లుగా నియమించుకున్నారు. ఎమ్మెల్యేతో ఎడమొహం పెడమొహం కాదు. నేరుగా విభేదిస్తున్నారు. కనీసం బీజేపీ అయినా పొత్తులో భాగంగా కలిసి వస్తుంది అంటే ఎమ్మెల్యే పాల్గొన్న ఏ కార్యక్రమానికి కూడా ఉన్న పది మంది బిజెపి నాయకులు వెళ్లడం లేదు. దీంతో ఎమ్మెల్యే ఒంటరి అయ్యారన్న చర్చ జరుగుతోంది.

మరోవైపు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇప్పటివరకు కాకినాడ సిటీలో కొండబాబుకు ధీటుగా మరో మత్స్యకార నాయకుడు లేడని అందరూ భావించారు. ఆయన కూడా అదే భావనలో ఉండేవారు. అందుకే తనకు టికెట్ ఇస్తున్నారు అనేవారు. ఇప్పుడు సామాజిక ఉద్యమాలలో, మహిళా సమస్యల పరిష్కారంలో కీలకపాత్ర పోషిస్తున్న కర్రి పద్మశ్రీ టిడిపిలో అధికంగా చేరిపోయారు. పైగా ఆమె జాతీయ మత్స్యకార సమాఖ్య అధ్యక్షురాలుగా, మత్స్యకార మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. బిజెపి నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. నగరంలోని విద్యావేత్తలు అందరూ ఆమెకు మద్దతు ఇస్తున్నారు.

టిడిపికి పద్మశ్రీ పెద్దదిక్కుగా మారారు. ఎమ్మెల్యే అంటే గిట్టనివారు, ఎమ్మెల్యేని వ్యతిరేకించేవారు పద్మశ్రీ పంచన చేరిపోతున్నారు. మరోపక్క వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయాల్లో మళ్ళీ కీలకమయ్యారు. కొండబాబుకు సవాళ్లు విసురుతున్నారు. కూటమికి వ్యతిరేకంగా నగరంలో భారీ ఉద్యమాలు చేస్తున్నారు. ఆయన కార్యాలయం నుంచే జిల్లా వైసీపీ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే.. కూటమి అధికారంలోకి వస్తే చంద్రశేఖరరెడ్డి ఆటలు కట్టిస్తానని సవాల్ విసిరిన కొండబాబు అసలు పెదవి విప్పడం లేదని నగరంలోని మేధావులు విమర్శిస్తున్నారు. వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు చంద్రశేఖరరెడ్డి పై లక్షల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు చేసిన కొండబాబు ఇప్పుడు ఎందుకు అవి పట్టించుకోవడం లేదు.. వాటిపై ఎందుకు విచారణ చేయించడం లేదని బాధితవర్గాలు ఎమ్మెల్యేను నిలదీస్తున్నాయి. చంద్రశేఖరరెడ్డి కబ్జాలపై ఎందుకు చర్యలు తీసుకోరని నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఇక ఇవన్నీ చూస్తే ఎమ్మెల్యేకు చుక్కలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. Deputy CM Pawan Kalyan.

మొత్తంమీద కాకినాడకు అన్ని తానై వ్యవహరించాలని అనుకుంటున్న ఎమ్మెల్యే ఆశలన్నీ ఆడియాశలవుతున్నాయి. పొత్తు ధర్మంలో ఉన్న బిజెపి, జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తనను కాదని తన సోదరుని కుమారుడు రాజకీయం చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్సీ చక్రం తిప్పుతున్నారు. అంతేకాదు కాకినాడ జిల్లాకు టిడిపి తరఫున పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ తో కూడా ఎమ్మెల్యేకు అంతంత మాత్రం సంబంధాలే ఉన్నాయి. దాంతో ఎమ్మెల్యే కొండబాబుకు ఏది కలిసి రావడం లేదని అనుచరులు వాపోతున్నారు. ఇక రానున్న మూడేళ్లు ఆయనకు కష్టమే అన్న టాక్ సైతం వినిపిస్తోంది. ఇప్పటికే ఇదే ఆఖరిసారి టిక్కెట్ అని అధిష్టానం ప్రకటించింది. తన కుమారుడు మోహన్ వర్మను వారసుడిగా ప్రకటించుకుని ఆయనను ప్రమోట్ చేయాలని చేస్తున్న ప్రయత్నాలు దెబ్బకొడుతున్నాయి. మోహన్ వర్మ ప్రజలలో కలవలేక పోతున్నారు. దీంతో ఏడదిన్నరలోనే ఎమ్మెల్యే అసమ్మతితో సతమతమవుతున్నారు అన్నది కాకినాడలో పెద్ద చర్చకు దారితీసింది.