
Mahila Samaikya Petrol Bunk: మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని ఆ మహిళా మణులు నిరూపించారు. ఆకాశమే హద్దుగా.. అవకాశం వస్తే నింగి నేలను ఒకటి చేస్తూ ముందుకు సాగుతున్నారు.. ఏలాంటి ఒత్తిడినైనా తట్టుకునే శక్తి వారిది.. లక్ష్యాన్ని చేరుకోవడమే వారి వృత్తి.. మారుతున్న కాలానికి అనుగుణంగా వారిలో కూడా సాధించాలన్న పట్టుదల పెరుగుతున్నది.. పేదరికం జయించి సమాజంలో తమ కుటుంబాలను ఉన్నత స్థితిలోకి చేర్చడమే ఆ మహిళల లక్ష్యంగా ముందుకు సాగుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకు ఆ మహిళలు ఎవరు తెలుసుకోవాలంటే లట్స్ వాచ్ దిస్ స్టోరీ
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తోంది. మహిళా సాధికారతను పెంచేందుకు ‘ఇందిర మహిళా శక్తి’ పేరుతో వినూత్న కార్యక్రమాలను ప్రారంభించారు. స్వయం సహాయక బృందాల (SHG) మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా.. నారాయణపేట జిల్లాలో మహిళా సాధికారతకు నిలువుటద్దంగా నిలిచిన ఒక వినూత్న ప్రయోగం అద్భుతమైన విజయాన్ని సాధించింది. దేశంలోనే తొలిసారిగా జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభమైన ఆరు నెలల్లోనే అంచనాలకు మించి లాభాలు ఆర్జించి ఒక సరికొత్త రికార్డును నెలకొల్పింది.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం చౌరాస్తాలో రాష్ట్రంలోనే కాక దేశంలోనే మొట్టమొదటి మహిళ పెట్రోల్ బంక్ ఏర్పాటయ్యింది. ఫిబ్రవరి 21 న సీఎం రేవంత్ రెడ్డి ఈ పెట్రోల్ బంకును ప్రారంభించారు. ఇక్కడ పనిచేసే వారంతా మహిళలే..పెట్రోల్ పోసే ఉద్యోగి నుంచి.. మేనేజ్మెంట్ చేసే వారి దాకా అంతా మహిళలే. నారాయణపేట జిల్లా మహిళా సంఘం సభ్యులు ఈ పెట్రోలు బంకును ఏర్పాటుచేసుకున్నారు. ఇలా వారు బంకు ఏర్పాటు చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ చొరవ చూపింది. ఈ బంకును భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించింది. ఇందుకోసం కోటీ ఇరవైమూడు లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. మహిళాసమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేయించాలనే గతంలో భావించినా అడుగు ముందుకు పడలేదు. వారి పట్టుదలను గుర్తించి కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రోత్సహించారు. డీఆర్డీఏ కార్యాలయానికి అనుకొని ఉన్న ఆరు గుంటల ప్రభుత్వ భూమిని డీఆర్డీఏ, జడ్ఎంఎస్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి బీపీసీఎల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ సహకారంతో తక్కువ కాలంలోనే పెట్రోల్ బంకును ఏర్పాటు చేసుకున్నారు.
రాష్ట్రంలోనే తొలి మహిళా పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. 35 వేల లీటర్ల పెట్రోల్, డిజిల్ నిల్వ సామర్థ్యం ఉండే ఈ బంకు 24 గంటలూ పనిచేస్తుంది. బంకు నిర్వహణ ద్వారా వచ్చే కమిషన్ జిల్లా సమాఖ్యకు చేరుతుంది. దీనికి అదనంగా ప్రతి నెలా 10 వేల రూపాయలు బీపీసీఎల్ మహిళా సమాఖ్యకు అందిస్తుంది.ఈ బంకు నిర్వహణ ద్వారా 10 మంది మహిళా సభ్యులకు ఉపాధి లభించనుంది. ఇక్కడి జనం పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న మహిళలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఎంతైనా ఆడవాళ్ల ఓపికే వేరు అని కొనియాడుతున్నారు. పెట్రోల్ బంక్ ను విజయపథంలో నడిపించడంలో మహిళల ఓపిక, ఉత్సాహం, శక్తిసామర్థ్యాలు వారికి ఇంధనంగా మారాయి.
నారాయణపేటలో మహిళ సంఘం ద్వారా పెట్రోల్ బంకును ఏర్పాటు చేసుకుంటామని కలలో కూడా ఊహించలేదని. ఇది అయ్యే పని కాదనుకున్నాం.కానీ ప్రభుత్వ ప్రోత్సాహంతో బంకు ఏర్పాటు కావడం, అందులో ఉద్యోగంలో చేరడం సంతోషంగా ఉందని మహిళలంటున్నారు. నెలకు 11 వేల జీతం వస్తుంది. కుటుంబానికి అండగా ఉండేందుకు తోడ్పడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. గృహిణులుగా, వ్యవసాయ కూలీలుగా పనిచేసే తాము పెట్రోల్ బంకును నిర్వహించడం ద్వారా నెలవారీ ఆదాయంతో పాటు సమాజంలో గౌరవం పొందుతున్నామని మహిళలు చెబుతున్నారు. తాను నారాయణపేట జస్ఎంఎస్ అధ్యక్షురాలిగా మూడేళ్ల నుంచి పనిచేస్తున్నానని.. జర్ఎంఎస్ కు వరి కొనుగోలు కేంద్రాల ద్వారా, స్త్రీనిధి కింద వచ్చే ఆదాయంతో నెట్టుకొచ్చేవాళ్లమని. పెట్రోల్ బంక్ రూపంలో అదనపు ఆదాయం రావడంతో మరింత మంది ఉపాధి అవకాశాలకు వీలైందని మేనేజర్ చంద్రకళ చెబుతున్నారు. Mahila Samaikya Petrol Bunk.
సరైన ప్రోత్సాహం, సహకారం ఉంటే మహిళలు ఏదైనా సాధించగలరని చెప్పేందుకు ఈ బంకు లాభాలే ఓ నిదర్శమని చూపుతున్నారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలోనే మొదటి మహిళా పెట్రోల్ బంక్ లాభాల బాటలో పయనించడం ప్రభుత్వ ప్రయత్నానికి ఓ స్పూర్తినిస్తోంది.