రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జనావాసాల మధ్య సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకి గురి చేసిన పెద్ద పులి మరోసారి జనావాసాలకు సమీపంగా వస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గత నెలలో కూర్మాపురం వద్ద బంధించి- నిపుణుల సూచనతో పులి మెడలో రేడియో కాలర్ వేసి సేఫ్ గా ఫారెస్ట్ ఏరియాలో విడిచిపెట్టగా..అది తిరిగి జనావాసల వైపు అడుగులు వేస్తోంది. ఈ మేరకు అటవీశాఖ అధికారులకు రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టం నుండి సందేశం అందగా, విషయాన్నిడిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ‘హనుమాన్’ బృందాలను అలర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. పులి మూమెంట్స్ ను ఎప్పటికప్పుడు అంచనా వేసి దాన్ని సేఫ్ గా బంధించి విశాఖ జూ పార్క్ లో వదలాలని సూచించారు. అందుకోసం రాజమండ్రి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో 10 హనుమాన్ టీమ్ లను స్పెషల్ గా నియమించారు. పులి మెడలో ఉన్న రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టం సందేశాల ఆధారంగా పులి తిరిగి జనావాసాల మధ్యకు రాక ముందే సురక్షితంగా పట్టుకోవాలని తెలిపారు. పులి మూమెంట్స్ పై సమీప ఆవాసాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రాణనష్టం, జంతు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియ పర్యవేక్షణ బాధ్యతను పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావుకి అప్పగించారు. ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, హనుమాన్ టీమ్ లు సమర్ధవంతంగా పని చేస్తున్నాయని తెలిపారు. ప్రజలు కూడా సంయమనంతో వ్యవహరిస్తూ అటవీ సిబ్బందికి సహకరించాలని కోరారు.