భారత మహిళా క్రికెట్ 2025కు ఘనమైన వీడ్కోలు పలికింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో మన జట్టు జోరు కొనసాగించింది. శ్రీలంకతో జరిగిన ఆఖరి టీ20లో 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (68; 43 బంతుల్లో 9×4, 1×6) రాణించడంతో మొదట భారత్ 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అరుంధతి రెడ్డి (27 నాటౌట్; 11 బంతుల్లో 4×4, 1×6) ధాటిగా ఆడింది. టార్గెట్ ఛేదనలో లంక 7 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. హాసిని పెరీరా (65; 42 బంతుల్లో 8×4, 1×6), ఇమేషా (50, 39 బంతుల్లో 8×4) హాఫ్ సెంచరీలు సాధించారు. దీప్తి, ఆరుంధతి, స్నేహ్, వైష్ణవి, శ్రీచరణి, అమన్ జ్యోత్ తలో వికెట్ పడగొట్టారు. టీ20 క్రికెట్లో భారత్ 5-0తో సిరీస్ గెలవడం ఇది మూడోసారి. సొంతగడ్డపై మొదటిసారి. హర్మన్ ప్రీత్ కౌర్ కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. షెఫాలి వర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికైంది.
భారత్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 175-7.
శ్రీలంక ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 160-7.