ద్రాక్షారామలో శివలింగం ధ్వంసం…నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు!

Spread the love

ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని తోటపేటకు చెందిన శీలం శ్రీనివాస్ గా గుర్తించినట్లు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి ఉత్తర గోపురం వద్ద ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని నిందితుడు ధ్వంసం చేయగా, మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. డ్రైనేజీ వివాదం కారణంగా ఆలయ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయాలనే కక్షతోనే శ్రీనివాస్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేకపోయినప్పటికీ, పరిసర ప్రాంతాల్లోని ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ సాయంతో సేకరించిన ఆధారాలు ఈ కేసు ఛేదనలో కీలకంగా మారాయి. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ కేసును త్వరగా ఛేదించిన పోలీస్ యంత్రాంగాన్ని పలువురు అభినందిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.