ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన చర్య విమర్శలకు తావిస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఏపీ మాజీ సీఎం వై.ఎస్.జగన్ కూడా స్పందించారు. నిన్న AI సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ ప్రవర్తన మనందరినీ సిగ్గుపడేలా చేసింది. మన రాజకీయాలు ఎటు వెళ్తున్నాయి! ఎవరూ కూడా మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. మన మధ్య ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, ప్రపంచం ముందు మనం ఎప్పుడూ ఐక్యంగానే ఉండాలని పేర్కొన్నారు.
ఇక వివరాల్లోకి వెళితే ఏఐ సమ్మిట్ వద్ద నిన్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎగ్జిబిషన్ హాల్ నంబర్-5 వద్ద నిరసనకు దిగారు. పదుల సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు హఠాత్తుగా టీ-షర్టులు విప్పేసి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశం ఒక అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న వేళ ఇటువంటి రాజకీయాలు చేయడం తగదని దీని వలన దేశం అవమానపడకూడదని మండిపడుతున్నారు.