కూటమి పాలనపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు

Spread the love

అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని  అంతా పరనింద.. ఆత్మస్తుతి అని ఏపీ మాజీ సీఎంజ్, వైసీపీ అధినేత  వై.ఎస్.జగన్ విమర్శించారు. అసెంబ్లీలో మొత్తం జరిగింది ఇదే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో మోసాలు, అబద్ధాలే కనిపించాయి తప్ప.. ప్రజలకు జరిగిన మేలు గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న ఆర్థిక విధ్వంసాన్ని కాగ్‌ కళ్లకు కట్టినట్టు చూపించిందన్నారు.  చంద్రబాబుగారి కూటమి హయాంలో రెవిన్యూలోటు, ద్రవ్యలోటు భారీగా పెరిగిపోయాయన్నారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు తెచ్చిన మొత్తం అప్పులు రూ.3.2లక్షల కోట్లని మా హయాంలో చేసిన అప్పుల్లో 96% అప్పులు ఈ రెండేళ్లలోనే చేశారని జగన్ దుయ్యబట్టారు. తమ  ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు కేవలం 3.31 లక్షల కోట్లు మాత్రమేనన్నారు. ఎవరు జాగ్రత్తగా ఆర్థిక వ్యవస్థను నిర్వహించారు, ఎవరు ఆర్థిక వ్యవస్థను డ్యామేజ్ చేశారన్నది కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందన్నారు. వనరులన్నింటినీ కూడా దోచేసి సొంత జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్స్‌, లెటరైట్‌, గ్రానైట్‌, లిక్కర్‌, భూములు, అధిక రేట్లకు పీపీఏలు దేన్నీ వదిలిపెట్టడంలేదని విమర్శించారు. దోపిడీ జరిగితే, ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? సంక్షేమం, అభివృద్ధి ఎలా నడుస్తుంది? అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో అత్యంత విలువైన భూములను కారుచవకగా కట్టబెడుతూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. రూ.5వేల కోట్ల విలువ చేసే 54 ఎకరాల ప్రభుత్వ భూములను చంద్రబాబు బంధువు కబ్జాచేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వంతోపాటు వ్యవస్థలన్నీ చోద్యం చూస్తున్నాయని ప్రజల ఆస్తులను రాబందుల్లా కొల్లగొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుగారు తన కొడుక్కి జాకీలు పెట్టి ఎత్తితే, చంద్రబాబుగారికి ఆయన కొడుకు జాకీలు పెట్టి ఎత్తుతాడు. వీళ్లిద్దరికీ పవన్‌కళ్యాణ్‌ మరొక జాకీ పెట్టి లేపుతాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బడ్జెట్ పై గత  ప్రెస్‌మీట్లో నేను ప్రస్తావించిన వాటిలో ఒక్క ప్రశ్నకు కూడా ముఖ్యమంత్రికాని, మంత్రులుకాని సమాధానాలు చెప్పలేదని జగన్ పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి, ఎప్పుడు అమలు చేస్తారన్నదానిపై, ఈ 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. 18 ఏళ్లు నిండిన 60 ఏళ్లు లోపు ఉన్న మహిళలకు “ఆడబిడ్డ నిధి’’అని, నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామన్నారని దానిపై  కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. 50ఏళ్లు నిండిన ST,SC,BC మైనార్టీలకు పెన్షన్‌ కింద నెలకు రూ.4వేలు చొప్పున ఇస్తామన్నారు ఎప్పుడు ఇస్తారో  కనీసం మాట్లాడలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతుల కష్టాలు గురించి మాట్లాడటం, చర్చించడం కనీసం మచ్చుకకి కూడా కూటమి నేతలు చేయలేదని రైతన్నలు కష్టాలతో కొట్టుమిట్టాడుతుంటే ఎమ్మెల్యేలు ఆటలు, స్కిట్‌లతో కాలక్షేపం చేశారని ఆక్షేపించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *