తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శివ ప్రతాప్ శుక్లా తో ప్రమాణం చేయించారు. లోక్‌భవన్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఇక గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణం చేశారు. తెలంగాణకు రాకముందు ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశారు. గతంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.అంతకుముందు గవర్నర్‌గా ఉన్న జిష్ణు దేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ అవ్వడంతో, ఆయన స్థానంలో శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు.