కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపుతుంది:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

Spread the love

కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.  కాకినాడలో ఏఎం గ్రీన్ వారి గ్రీన్ ఆమ్మోనియా ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్రాభివృద్ధిలో భాగం కావాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారుల్ని బెదిరించిందని కూటమి ప్రభుత్వం వేధించదు… అండగా ఉంటుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు గేమ్ ఛేంజర్ అని తెలిపారు. దేశ కాలుష్యరహిత ఇంధన ప్రయాణంలో కీలక మైలురాయి అని అన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రాన్ని అగ్రపథాన నిపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పవన్ స్పష్టం చేశారు. ఆ దిశగా వేసిన బలమైన అడుగు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ అని అన్నారు. ప్రభుత్వాలు మారినా పాలనా విధానాలు స్థిరంగా ఉండాలని అన్నారు.  గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించగలిగితే పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు.  క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా ఇప్పటికే కూటమి ప్రభుత్వం విధానపరమైన స్పష్టత ఇచ్చింది. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు ఏపీ  గమ్యస్థానం కావాలన్నారు. అదే చంద్రబాబు నాయకత్వంలోని  కూటమి ప్రభుత్వ విధానం. క్లీన్ ఎనర్జీ పాలసీని సద్వినియోగం చేసుకుంటూ ఈ రోజు ఏఎం గ్రీన్ సంస్థ మన కాకినాడలో దేశంలోనే మొట్టమొదటి మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమ్మోనియా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దేశ కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో ఇదో చారిత్రక మైలురాయిగా అభివర్ణించారు. 

బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం అని గ్రీన్ కో వ్యవస్థాపకులు చలమలశెట్టి అనిల్ నిరూపించారన్నారు. అనేక కష్టనష్టాలను తట్టుకుని ఈ రోజున ఏఎం గ్రీన్ కంపెనీ స్థాపించారు. కాకినాడలో 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ. 15, 600 కోట్లు పెట్టుబడితో ప్రారంభం అవుతున్న ఈ సంస్థలో 8 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పాదక ఇంధన పెట్టుబడులు రానున్నాయి. 2027 ఏడాది చివరికి తొలి దశ కమిషనింగ్ లక్ష్యంగా, పునరుత్పాదక ఇంధన ఆధారిత శుద్ధ ఇంధన కేంద్రంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతోందని అన్నారు. నిర్మాణ దశలో సుమారు 8,000 మందికి, ఆపరేషన్ దశలో సుమారు 1,500 మందికి ప్రత్యక్ష ఉపాధి, పరోక్షంగా కొన్ని వేల మందికి దీర్ఘకాల ఉపాధి అవకాశాలు సృష్టించే ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.