యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమాకు సంబంధించి ప్రస్తుతం నడుస్తున్న వివాదం గురించి తెలిసిందే. ఈ టీజర్ చుట్టూ మొదలైన వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. టీజర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియా, రాజకీయ వర్గాలు, మహిళా సంఘాల వరకు ఈ అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ వివాదంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్( సెన్సార్ బోర్డు) ఛైర్మన్ ప్రసూన్ జోషి స్పందించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాను స్పష్టమైన వ్యాఖ్య చేయలేనని తెలిపారు.ఈ పరిస్థితుల్లో నేను ఎలాంటి కామెంట్ చేయలేను. కానీ, ఒక విషయమైతే నేను స్పష్టంగా చెప్పగలను. యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మీరు చూసే ఎన్నో వీడియోలకు సెన్సార్ సర్టిఫికెట్ ఉండదు. అవి మా పరిధిలోకి రావు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంతో పాటు, చూసే ప్రతీది సెన్సార్ పొందిందే అన్న భావనలో నుంచి బయటకు రావాలి. ఓటీటీ కంటెంట్ కూడా సెన్సార్ పొందిందనే అనుకుంటారు. కానీ, అవి మా వద్దకు రావు. ఆ కంటెంట్‌కు ధ్రువీకరణ ఉండవని చెప్పారు. ఇదే సందర్భంలో, ఇటీవల వివాదాల్లో ఉన్న మరో సినిమా ‘ జన నాయగన్’ గురించి మాట్లాడేందుకు ప్రసూన్ జోషి నిరాకరించారు. ఆ చిత్రం ప్రస్తుతం చట్టపరమైన సమస్యల్లో ఉందని, విచారణ కొనసాగుతోందని మాత్రమే తెలిపారు. ఇక అసలు వివాదానికి కారణమైన ‘ టాక్సిక్’ సినిమా విషయానికి వస్తే కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా స్టార్డమ్ అందుకున్న యశ్, ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్- అప్స్’ అనే కాప్షన్ ఉంది. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌లో యశ్ పాత్రను పరిచయం చేయగా, అందులో కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో విమర్శలు వెల్లువెత్తాయి.