త్వరలోనే కృష్ణా, గోదావరి నదీ తీరాల్లో హౌస్ బోట్స్ సేవలు

Spread the love

రాష్ట్ర పర్యాటక అభివృద్ధిలో భాగంగా త్వరలోనే కృష్ణా, గోదావరి నదీ తీరాల్లో హౌస్ బోట్స్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు ఏపీ పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడలోని పర్యాటక ప్రాంతాలైన భవాని ద్వీపం, పున్నమిఘాట్‌లలో నిర్వహించనున్న ‘ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్’ ఏర్పాట్లను మంత్రి దుర్గేష్ పరిశీలించారు. కృష్ణా నదీ తీరంలో ఏర్పాటు చేసిన హౌస్ బోట్స్‌ను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించనుండగా ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నారు. జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు జరిగే ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.తెలుగు సినిమా, సంస్కృతి, కళలు, సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటే లక్ష్యంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నాం. ఈ ఫెస్టివల్‌లో సినిమా ప్రదర్శనలు, సాహిత్య చర్చలు, కవితా పఠనాలు, సంగీతం, నృత్యం, నాటకాలు, వర్క్‌షాప్‌లు, సాంస్కృతిక భాషణలు, ఆధునిక కళా ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.

సాంకేతికతతో కూడిన ఆర్థిక వృద్ధిని సాధిస్తూనే రాష్ట్ర సంస్కృతిని పరిరక్షించాలనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూరదృష్టికి ఈ ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్ ఒక నిదర్శనమని మంత్రి దుర్గేష్ తెలిపారు.  ఈ వేడుకల్లో సినిమా, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు, అంతర్జాతీయ కళాకారులు పాల్గొననుండగా, హెరిటేజ్ వాక్, ఘాట్ ఫెర్రీ ప్రయాణం, ఫుడ్ ఫెస్టివల్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉండనున్నాయి.