పిఠాపురంలో రేపటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ పర్యటన.. సంక్రాంతి సంబరాలకు శ్రీకారం

Spread the love

రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి మహోత్సవాలు పిఠాపురంలో జరగనున్నాయి. రేపటి నుంచి తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రేపు సంక్రాంతి సంబరాలకు శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం వేదికగా ‘పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు’ జరగనున్నాయి. పిఠాపురం వేదికగా మూడు రోజులపాటు నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలు ఆద్యంతం తెలుగుదనం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. మొదటి రోజు సంక్రాంతి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, జానపదగీతాలాపనలు, వీర నాట్యాలు, ఉరుముల నృత్యాలు, తప్పెట గుళ్లు, గరగు నృత్యాలు, లంబాడ నృత్యం, డప్పులు, గిరిజన సంప్రదాయ నృత్యరీతి అయిన థింసా, అలాగే కూచిపూడి, భరతనాట్యం తదితర శాస్త్రీయ నాట్య ప్రదర్శనలు, కోలాటాలు ఏర్పాటు చేశారు. రెండో రోజు జనవరి 10 తేదీన మొదటి రోజు ప్రదర్శనలతోపాటు కేరళ సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు ఉంటాయని డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇక  చివరి రోజు గ్రామీణ జానపదుల పాటలు, సినీ మ్యూజికల్ నైట్ కార్యక్రమాలు ఆహుతులను అలరించనున్నాయి.