​మాతృభాష పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం:అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు 

Spread the love

​ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా మాతృభాషను ఎంతో ఆదరిస్తుంటే మన సొంత రాష్ట్రంలోనే తెలుగు మాట్లాడే పరిస్థితి కరువవ్వడం అత్యంత బాధాకరమని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. అమలాపురంలోని కిమ్స్ మెడికల్ కాలేజ్, రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. వివిధ ప్రచారాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం కానీ, అమ్మ భాషను బతికించుకునే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకమని, ఒకప్పుడు ‘అమ్మా’, ‘నాన్నా’ అని ఆప్యాయంగా పిలిచే సంస్కృతి ఉండేదని, నేడు ఆ స్థానంలో ‘హాయ్ బ్రో’, ‘సిస్’, ‘మమ్మీ’, ‘డాడీ’, ‘గ్రాండ్ ఫా’ వంటి ఆంగ్ల పదాలు వచ్చి చేరాయని అన్నారు.  ​మాతృభాష పరిరక్షణ దిశగా శాసనసభ స్పీకర్‌ గా తాను ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగును ఒక తప్పనిసరి పాఠ్యాంశంగా అమలు చేయాల్సిన అవసరం ఉందనీ, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు వెల్లడించారు. అలాగే, అసెంబ్లీలో సభ్యులంతా,తప్పనిసరిగా తెలుగులోనే మాట్లాడాలని, ప్రశ్నలు తెలుగులోనే అడగాలని, మంత్రులు సైతం సమాధానాలు తెలుగులోనే చెప్పాలని తాను ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ మహాసభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు, ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *