భారత్ లో ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ సరికొత్త చరిత్ర సృష్టిస్తూ టైటిల్ విజేతగా నిలిచింది. హుబ్లీ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్లో 8 సార్లు ఛాంపియన్ అయిన కర్ణాటకతో మ్యాచ్ ను డ్రా చేసుకుంది. అయితే, కీలకమైన తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 291 పరుగుల భారీ ఆధిక్యంతో జమ్మూ కశ్మీర్ టైటిల్ ను కైవసం చేసుకుంది. మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో జమ్మూ కాశ్మీర్ 584 పరుగులు చేసింది. శుభమ్ పుందిర్ 121 (12×4, 2×6) సెంచరీతో ఆకట్టుకున్నాడు. యావెర్ హాసన్ 88 (13×4), సాహిల్ లోత్ర 72 (8×4), కన్హయ్య వాదవన్ 70 (9×4), అబ్దుల్ సమద్ 61 (6×4, 1×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. కర్ణాటక బౌలర్లలో ప్రసీద్ కృష్ణ 5 వికెట్లు, విద్యాధర్ పాటిల్, విజయ్ కుమార్ వైషక్, శ్రేయాస్ గోపాల్, శిఖర్ శెట్టి ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం మొదటి ఇన్నింగ్ ఆరంభించిన కర్ణాటక 293 పరుగులకే ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ 160 (21×4), కృతిక్ కృష్ణ (36), శ్రేయాస్ గోపాల్ (27) పరుగులు చేశారు. జమ్మూ కాశ్మీర్ బౌలర్లలో ఆకీబ్ నబీ దార్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. సునీల్ కుమార్ 2 వికెట్లు, యుధ్విర్ సింగ్ చరక్ 2 వికెట్లు, సాహిల్ లోత్ర 1 వికెట్ తీశారు. దీంతో జమ్మూ కాశ్మీర్ కు మొదటి ఇన్నింగ్స్ లో 291 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో కూడా జమ్మూ కాశ్మీర్ మంచి స్కోర్ సాధించింది. 4 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. కమ్రాన్ ఇక్బాల్ 160 నాటౌట్ (16×4, 3×6) భారీ సెంచరీ సాధించాడు. సాహిల్ లోత్ర 101 నాటౌట్ (8×4, 3×6) రాణించాడు. ఇక డ్రా కారణంగా మ్యాచ్ ఫలితం తేలనప్పుడు రంజీ నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ మ్యాచ్‌లో జమ్మూ కాశ్మీర్ ఏకంగా 291 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.