గుంటూరు శివారులోని శ్రీసత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో జరుగుతున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.తరతరాల మధ్య కుటుంబ బంధాలను బలోపేతం చేసే శక్తి భాషకు మాత్రమే ఉందని, ఆంగ్లం నేర్చుకోవడం తప్పు కాదని, కానీ సొంత మాతృభాష అయిన తెలుగును మరచిపోవడం మాత్రం పెద్ద తప్పని ఆయన స్పష్టం చేశారు. తాను 25 ఏళ్ల పాటు అమెరికాలో ఉన్నప్పటికీ, నేడు ప్రజల మధ్య నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి మూలకారణం తన మాతృభాషపై ఉన్న మమకారమేనని గుర్తుచేసుకున్నారు. తెలుగు నేర్చుకున్న పిల్లల్లో విషయ పరిజ్ఞానంతో పాటు జ్ఞాపకశక్తి కూడా అధికంగా ఉంటుందని, పూర్వం చందమామ కథలు, సామెతలతో పిల్లలను సంస్కారవంతంగా పెంచేవారని ఆయన పేర్కొన్నారు.తెలుగును ప్రభుత్వానికి అధికార భాషగా కాకుండా, గుండెల్లో మమకార భాషగా ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.