పసిడి, వెండి ధరలు గతేడాది నుంచి భారీగా పెరుగుతూ దూసుకుపోతున్నాయి. ఇక తాజాగా అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా భావించి గోల్డ్ ను ఎంచుకుంటున్నారు. అమెరికా బలగాలు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకోవడంతో ఈరోజు గోల్డ్, వెండి ధరలు ఒక్కసారిగా మరింత పెరిగాయి. ఈ పరిణామంతో పెరిగిన ‘సేఫ్ హెవెన్ డిమాండ్’ బులియన్ మార్కెట్ కు మరింత జోష్ ఇచ్చింది.
మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం, వెండి ఫ్యూచర్స్ దూసుకెళ్తున్నాయి. వెనెజువెలా పరిణామాలతో పాటు రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల్లో నెలకొన్న అనిశ్చితి, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు కూడా గోల్డ్ పెరుగుదలకు కారణమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం దేశీయంగా ధరల పెరుగుదలకు ఊతమిచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 1.5 శాతం పెరిగి 4,395 డాలర్లకు చేరింది.