ప్రముఖ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు సరికొత్త విషయాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. గుంటూరు చుట్టుపక్కల ఎండబెట్టిన ఎర్రటి మిర్చి కళ్ళాలు, పచ్చటి పంట పొలాలు రంగురంగులతో ఆకట్టుకుంటున్న ఈ వీడియోను ఆయన షేర్ చేశారు.
హోలీ పండుగ పూట చూడదగ్గ అద్భుతమైన దృశ్యం ఇది… భారతదేశపు రంగులు రకరకాలుగా ఉద్భవించి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.పైనుంచి చూసినప్పుడు, ఆరబెట్టిన మిరపకాయలు ఒక అద్భుతమైన రంగుల తివాచీలా కనిపిస్తున్నాయి.ఇది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా. భారతదేశపు మొత్తం మిర్చి ఉత్పత్తిలో ఈ ఒక్క జిల్లా వాటానే 15% ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ కు టూరిజమ్ డెవలప్ చూసే విధంగా ఈ ప్రాంతంలో ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనే దానిపై ఆయన ఆలోచనలు కూడా పంచుకున్నారు. ఇది శీతాకాలపు కోత కాబట్టి, పర్యాటకానికి సమయం కూడా సరిగ్గా సరిపోతుంది. ఆ అందమైన ప్రాంతాన్ని పై నుండి చూసే విధంగా హాట్ ఎయిర్ బెలూన్ (Hot Air Balloon) రైడ్స్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది?అదే సమయంలో స్థానిక సంగీతం, నృత్య ప్రదర్శనలను ఏర్పాటు చేసి ఒక ఉత్సవంలా నిర్వహించవచ్చని అభిప్రాయపడ్డారు. దీని ద్వారా పర్యాటకుల రాక వల్ల స్థానిక జీవనానికి అంతరాయం కలుగుతుందని చాలామంది భావించవచ్చు. కానీ, దీనివల్ల స్థానిక రైతులకు మరియు ఇతర వర్గాలకు అదనపు ఆదాయం లభించే అవకాశాన్ని మనం విస్మరించలేమని ఆయన అన్నారు.
ఇక ఆనంద్ మహీంద్రా పోస్ట్ కు ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ఆనంద్ గారు, మీ ఆలోచనాత్మకమైన సలహాకు ధన్యవాదాలు. ఈ వర్ణరంజితమైన దృశ్యంలోని పర్యాటక అవకాశాలను మెరుగుపరిచే మార్గాలను అన్వేషించవలసిందిగా మా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారిని కోరతాను. ఆకాశం నుండి మీరు చూస్తున్న ఈ అద్భుతం వేలాది మంది రైతుల కఠోర శ్రమకు నిదర్శనం, అలాగే గుంటూరును అంతర్జాతీయ మిర్చి వాణిజ్య కేంద్రంగా నిలిపిన మన సంప్రదాయానికి ప్రతిరూపమని లోకేష్ పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన డ్రోన్ విజువల్స్ ఇక్కడి మహీంద్రా ఆటో ఫ్యాక్టరీని, రక్షణ రంగానికి చెందిన సంస్థలను మరియు ఏరోస్పేస్ పార్కును కూడా ప్రతిబింబిస్తే అది ఇంకా అద్భుతంగా ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అందించగల అవకాశాలను మరియు విశేషాలను మీకు స్వయంగా చూపించడానికి మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను అని లోకేష్ ఆనంద్ మహీంద్రాకు రిప్లై ఇచ్చారు.