ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచి ప్రధాని మోడీ పట్టెడన్నం పెట్టే కరువు పనిపై కుట్రలు చేశారని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఆ చట్టాన్ని మార్చి ఉపాధి హామీలో ఊపిరి తీశారు. మోడీ గారు తెచ్చిన కొత్త చట్టం ఉపాధి హామీలో ఉపాధి లేనట్లే. కాంగ్రెస్ అమలు చేసిన నరేగా పథకానికి, బీజేపీ తెచ్చిన జీ రామ్ జీ చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని షర్మిల సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు . వీబీ జీ రామ్ జీ ఒక నల్లచట్టం. పేదల పొట్టకొట్టిన చట్టం. ఉపాధిని హక్కుగా తీసేసి కేంద్రమే దిక్కుగా మార్చిన అక్రమ చట్టమని మండిపడ్డారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి YSR నేతృత్వంలో జాతీయ ఉపాధి హామీ(MGNREGA) చట్టానికి బీజం పడింది రాష్ట్రంలోనేనని అన్నారు . 2006 లో ఉపాధికి శ్రీకారం చుట్టింది ఏపీలోనే . దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ సారథ్యంలో నరేగా చట్టం ఆనాడు రాష్ట్రంలో అద్భుత విజయమని అన్నారు. పనికి ఆహార పథకం అమలులో అప్పుడు వై.ఎస్.ఆర్ పాలన దేశానికే ఆదర్శం. కరువు పని సక్సెస్ లో నాడు ఏపీ రోల్ మోడల్. ఉమ్మడి రాష్ట్ర గ్రామీణ ప్రాంత అభివృద్ధికి, బ్రతుకు జీవనాన్ని గ్యారెంటీ చేయడానికి, వలసలు నివారించి పేదల కొనుగోలు శక్తి పెంచడానికి, వ్యవసాయానికి సాయంగా,వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి ఆశయాలకు ఊతం ఇచ్చిందే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకమని అన్నారు. 2006 నుంచి నేటి వరకు 20 ఏళ్లలో రాష్ట్రానికి లక్ష కోట్లు వచ్చాయంటే, ఏడాదికి కోటి మందికి ప్రత్యక్షంగా పని గ్యారెంటీ అయ్యిందంటే కాంగ్రెస్ తెచ్చిన నరేగా చట్టం పుణ్యమేనని పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. AICC పిలుపు మేరకు, వై.ఎస్.ఆర్ ఆశయ సాధనను కాపాడేందుకు ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు,రైతు సంఘాలను కలుపుకొని అన్ని జిల్లాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. వీబీ జీ రామ్ జీ అక్రమ చట్టాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి అమలు పరచాలన్నారు.