వరంగల్ జిల్లా లోని రాయపర్తి మండలం, బంధన్ పల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని దుండగులు తగలబెట్టడంపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఈ హేయమైన చర్యను తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండించింది.జాతి కోసం, ధర్మం కోసం పోరాడిన మహనీయుడి విగ్రహాన్ని అవమానించడం హిందూ సమాజ ఆత్మగౌరవంపై జరిగిన దాడి అని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఇలాంటి దేశద్రోహ చర్యలకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఘటన జరిగిన వెంటనే గ్రామస్థులు, హిందూ సంఘాల నేతలు అక్కడ భారీగా మోహరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఈ వివాదం మరింత ముదరకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని, నిందితులను అరెస్ట్ చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలంగాణ బీజేపీ హెచ్చరించింది.