కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ పేలుడు ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దురదృష్టకర ఘటన గురించి తెలియగానే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలంలో ఉండి పరిస్థితిని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ… క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించే ఏర్పాట్లు చేశారు. బాణాసంచా తయారీ పరిశ్రమ నుంచి ఇంకా పేలుళ్లు వస్తున్నాయని అధికారులు తెలిపారు. పేలుళ్లకు కారణాలపై విచారణ చేస్తున్నారన్నారు. బాణాసంచా పరిశ్రమలపై అధికారులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచి భద్రత చర్యలను తనిఖీ చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. పరిసర గ్రామాలకు పొగ అలుముకున్న క్రమంలో ఆయా గ్రామాల ప్రజలకి ధైర్యం చెప్పి, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ లను ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షణ చేపట్టి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాలని పవన్ దిశానిర్దేశం చేశారు.