ఏపీలో మారిషస్ అధ్యక్షుడి పర్యటన..పలు పుణ్యక్షేత్రాల సందర్శన

Spread the love

ఆంధ్రప్రదేశ్ లో మారిషస్ అధ్యక్షుడు ధరమ్‌ బీర్ గోఖూల్ పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో  ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇక్కడికి వచ్చారు. నేడు మంగళగిరిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన  పానకాల నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. గోఖూల్ ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమవుతారు.  అనంతరం మంగళ, బుధవారాల్లో ఆయన తిరుపతి, తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. అలాగే శ్రీకాళహస్తిలోని ఆలయాలను కూడా సందర్శించనున్నారు.  గుంటూరులో జరుగుతున్న  ప్రపంచ తెలుగు మహాసభల్లో నిన్న గోఖూల్ పాల్గొని ప్రసంగించారు. తెలుగు కేవలం ఒక భాష మాత్రమే కాదు, అదొక జీవనాగరికత, గొప్ప ఆధ్యాత్మిక వారసత్వమని ఈ సందర్భంగా  కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఈ సభలు ఏకం చేస్తున్నాయని పేర్కొన్నారు.  ప్రస్తుతం 50కి పైగా దేశాల్లో తెలుగు మాట్లాడేవారు ఉన్నారని గుర్తు చేశారు. మారిషస్‌లో తెలుగు సమాజం దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. తమ దేశంలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయిలలో తెలుగును అధికారిక విద్యావ్యవస్థలో భాగంగా బోధిస్తున్నామని తెలిపారు. భారత్, మారిషస్ మధ్య సంబంధాలు చాపటిష్టంగా ఉన్నాయని స్పష్టం చేశారు.