ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించండి… మీరు అధిక లాభాలను సముపార్జించాలని రైతులకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. రైతు నేస్తం ఫౌండేషన్ దశమ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యడ్లపల్లి వెంకటేశ్వరరావు తో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్నదాతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే వేదిక నుంచి ఔషధ మొక్కలను కూడా పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక్కడి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి, వారు అనుసరిస్తున్న సంప్రదాయ ప్రకృతిసేద్యం పద్ధతులను తెలుసుకుని హర్షం వ్యక్తం చేశారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను ఆధునిక మార్గంలో రైతుల వద్దకు చేర్చి అవగాహన కల్పించడంతో పాటు, ఏటా రైతునేస్తం అవార్డులతో ప్రొత్సహిస్తున్న వెంకటేశ్వరరావు అభినందనీయులు అని కొనియాడారు. 2023ను ప్రపంచం సిరిధాన్యాల ఏడాదిగా గుర్తించింది. అంతకు ముందు నుంచే రైతు నేస్తం, సిరిధాన్యాల పట్ల అవగాహన కల్పించేందుకు చేసిన కృషి ఈ సందర్భంగా ప్రస్తావించారు. రైతులువ్యాపారులుగా మారాలని తమ పంటకు సరైన గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఆధునిక విధానాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఈ సందర్భంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉందన్నారు. ప్రభుత్వాలు కల్పించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచితాలు ఇస్తున్నాయని.. అలా ఇస్తే పని ఎందుకు చేయాలని ప్రశ్నించారు. దేశంలోని మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. విద్య, వైద్యం ఉచితంగా ఇచ్చిమిగతావన్నీ రద్దు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రతి నెలా చేసే అప్పులతో ప్రజలపై భారం పడుతోందని అన్నారు.