గుంటూరులో జరిగిన మూడో ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని తెలుగు జాతిపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు.తెలుగు జాతికి తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్న ఆయన, ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన కల్వకుర్తి, ఏఎంఆర్, నెట్టెంపాడు వంటి అనేక సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యతను గుర్తుచేశారు.కృష్ణా డెల్టా అభివృద్ధిలో భాగంగానే తెలంగాణకు నీరందించామన్న ఆయన, గోదావరిపై కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టినప్పుడు కూడా తాను ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదని స్పష్టం చేశారు.గతేడాది సుమారు 6 వేల టీఎంసీల గోదావరి నీరు వృథాగా సముద్రంలో కలిసిందని అన్నారు.గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, తెలుగు రాష్ట్రాల మధ్య నీటి విషయంలో విద్వేషాలు కాకుండా సమైక్యత ఉండాలని ఆకాంక్షించారు.గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టిన ఇబ్బంది ఉండదు, గోదావరి-కృష్ణా నదులను ఇప్పటికే అనుసంధానించామని, త్వరలోనే గోదావరి-పెన్నా నదుల అనుసంధానాన్ని కూడా పూర్తి చేస్తామని వెల్లడించారు.దేశవ్యాప్తంగా గంగా-కావేరి నదులు కలవాలని, నీటి సమస్య తీరాలని కోరుకుంటూ, తెలుగు ప్రజలంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి వైపు అడుగులు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.