తొలిసారి రాజధాని వేదికగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Spread the love

ఆంధ్రప్రదేశ్  రాజధాని అమరావతిలో మొట్ట మొదటి సారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు లోకేశ్, ఆచ్చెన్నాయుడు, తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరేడ్ లో పాల్గొన్న 11 దళాల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రగతిని చాటే విధంగా  22 శకటాలను ప్రదర్శించారు. రిపబ్లిక్ డే  వేడుకలను చూసేందుకు రాజధాని ప్రాంత రైతులు, విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగించారు. తొలిసారి రాజధాని అమరావతిలో జాతీయ జెండాను ఎగురవేస్తున్నాం. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న వారితో ఈ మంచి  క్షణాన్ని పంచుకోవడం గర్వకారణమని అన్నారు. స్వర్ణాంధ్ర-2047 కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తున్నట్లు వివరించారు. 2047 నాటికి ప్రపంచంతో పోటీ పడే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. కాలానుగుణంగా పాలన మారాలనేది ప్రభుత్వ సిద్ధాంతం. సాంకేతికత ద్వారా క్షణాల్లో పాలన ప్రజలకు చేరేలా వ్యవస్థను. తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రతి పౌరుడికి అవకాశాలు కల్పించి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. సమిష్టిగా  ఆరోగ్య ఆనంద, సౌభాగ్య ఆంధ్రప్రదేశ్ ను నిర్మిద్దాం ప్రతి గ్రామం, ప్రతి పట్టణం చైతన్యవంతంగా ఎదిగేలా చేద్దామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.