కరువు పనిపై కేంద్రం కుట్రలు చేస్తుంటే సీఎం చంద్రబాబు కిమ్మనకుండా ఉండటం దారుణమని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. బీజేపీ చేస్తున్న నల్ల చట్టాలకు చప్పట్లు కొట్టడం అత్యంత సిగ్గుచేటని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ఊతం ఇచ్చిందే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. YSR ముఖ్యమంత్రిగా అనాడు దేశంలోనే తొలి ఉపాధి జాబ్ కార్డ్ అందింది రాష్ట్రంలోనే. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పనికి ఆహార పథకంతో రాష్ట్రంలో ఏటా 80 లక్షల మంది పేదలకు ఉపాధి హక్కుగా మారింది.
దేశంలోనే ఉపాధి హామీ పథకాన్ని వాడుకుంటున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని తెలిసి, జీ రామ్ జీ పేరుతో తెచ్చిన అక్రమ చట్టంతో రాష్ట్రానికి ఏటా 4500 కోట్ల భారం అని తెలిసి, ఆర్థికంగా నిధులు సమకూర్చడం కష్టమని తెలిసి కూడా ప్రశ్నించకుండా బాబు గారు మౌనం వహించడం బాధాకరమని షర్మిల ఆక్షేపించారు. ప్రతి నెలా జీతాలు ఇవ్వడానికే అప్పులు చేసే మీరు..జీ రామ్ జీ పథకానికి ఏటా 40 శాతం నిధులు ఎక్కడ నుంచి తెస్తారు ? నిరుద్యోగంలో నెంబర్ 1 గా ఉన్న రాష్ట్రంలో ఉపాధికి ఉరి పెడుతుంటే ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ? కొత్త చట్టాలతో పనికి పాతరేస్తుంటే అడ్డుకొనే బాధ్యత మీకు లేదా ? మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రినా లేక మోడీ గారి చేతిలో తోలుబొమ్మనా ? అంటూ ప్రశ్నలు కురిపించారు.
నరేగా చట్టాన్ని తిరిగి పునరుద్ధరించేలా భేషరతుగా మద్దతు పలకాలని కూటమి పార్టీలను డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి ఊపిరి తీసిన జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయాలన్నారు. మోడీ గారి రామ్ జీ చట్టం రాష్ట్రానికే ప్రమాదమన్న షర్మిల వెంటనే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ తరుపున కూటమి పార్టీల నిర్లక్ష్యాన్ని ఎండగడతామని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.