అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని మద్యం దుకాణదారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఫిర్యాదులపై పవన్ స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎం.ఆర్.పి కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు అందింది. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన పవన్ ‘అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్దమని పేర్కొన్నారు. అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా తెస్తుంది. మద్యం విక్రయాల వ్యవహారంలో దుకాణదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాల’ని స్పష్టం చేశారు. సంబంధిత శాఖ అధికారులు మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు.