ప్రైవసీ పాలసీ అంశంలో ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సప్ మాతృ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మీరు మా దేశ ప్రైవసీతో ఆడుకోలేరు. మా డేటాలోని ఒక్క డిజిట్ ను కూడా పంచుకోవడానికి మేం అనుమతించం. ఒకవేళ దేశ చట్టాలను పాటించకపోతే భారత్ ను వీడి వెళ్లొచ్చని భారత ఛీఫ్ జస్టిస్ (CJI) జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు. 2021లో వాట్సప్ లో ప్రైవసీ విధానానికి సంబంధించిన ఓ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. తమ వాణిజ్య ప్రయోజనాల కోసం వాట్సప్ యూజర్ల డేటాను మెటాతో షేర్ చేసుకుంటోందని ఇది దోపిడీ కిందకే వస్తుందని ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. మెటాను హెచ్చరించారు. కొన్నిసార్లు మెటా పాలసీలను అర్థం చేసుకోవడానికి తాము కూడా ఇబ్బందిపడతామన్నారు. ఒకసారి తనకు ఓ డాక్టర్ వాట్సప్ లో మెడికల్ ప్రిస్క్రిప్షన్ పంపితే.. దానికి సంబంధించిన ప్రకటనలే ఫోన్లో కనిపించాయన్నారు. ఇక దేశంలోని లక్షలాది మంది పేద, చదువురాని ప్రజలు ఈ విధానాలను ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు.